చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. అమరావతి రాజధానికి ఒక నిర్దిష్టమైన రూపురేఖలు తీసుకువచ్చిన తర్వాత ఇక్కడే తన సొంత నివాస భవనం కూడా కట్టుకుంటానని గతంలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో ఒక స్థలం కొనుగోలు చేశారు. త్వరలోనే అక్కడ చంద్రబాబు నివాస భవన నిర్మాణం ప్రారంభం కాబోతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తన ఇంటి కోసం స్థలం కొనుగోలు చేయడం ద్వారా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడుకు సొంత ఇల్లు కూడా లేదని ఇన్నాళ్లు కుటిల విమర్శలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి నోళ్లకు చంద్రబాబు తాళాలు వేసినట్లు అయింది.
అమరావతి ప్రాంతంలోని వెలగపూడి రెవిన్యూ గ్రామ పరిధిలో ఈ-6 రోడ్డుకు ఆనుకొని 25 వేల చదరపు గజాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఇది మొత్తం దాదాపుగా 5 ఎకరాల స్థలం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతులు ఈ భూ యజమానులు కాగా వారందరికీ ఇప్పటికే డబ్బు చెల్లింపు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని లోనే అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఈ స్థలానికి ఆనుకునే వెళుతుంది. అలాగే విశాలమైన ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లే ఉన్నాయి. దానితోపాటు ఎన్జీవో నివాస భవనాల సముదాయం, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న బంగాళాల సముదాయం, ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్, విట్ యూనివర్సిటీ భవనాలు ఇలాంటివన్నీ కూడా ఈ స్థలానికి ఇంచుమించుగా రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉండడం విశేషం.
మొత్తం 25 వేల గజాలలో విస్తరించిన స్థలంలో కొంత భాగం మాత్రం చంద్రబాబు నాయుడు నివాసాన్ని నిర్మిస్తారని, మిగిలిన స్థలంలో భద్రతా సిబ్బందికి ఉండడానికి అవసరమైన గదులను, అలాగే కారు పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అప్పటికీ చాలా విశాలమైన స్థలం మిగులుతుంది. అదంతా ఉద్యానవనం అభివృద్ధి చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్థలంలో మట్టి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత ప్లాన్లు సిద్ధం చేయించి చంద్రబాబు నాయుడు సొంత ఇంటి నిర్మాణానికి త్వరలోనే పూనుకోబోతున్నట్లుగా సమాచారం.
ఇక్కడ ఒక సంగతిని ప్రజల కీలకంగా గమనించాలి. చంద్రబాబు నాయుడుకి ఇక్కడ సొంత ఇల్లు లేదు- ఓడిపోతే ఆయన హైదరాబాదు పారిపోతారు.. అని పదేపదే విమర్శిస్తూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి 2019 కి ముందే ఇక్కడ తాడేపల్లి లో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఇదే రాజధానిగా ఆమోదిస్తున్నట్టే కదా అని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్నారు. కానీ గెలిచిన వెంటనే ప్రజలను వంచించి, రాజధానిని విశాఖకు తీసుకువెళతానంటూ కొత్త డ్రామాకు తెర లేపారు. చంద్రబాబు నాయుడు అలా కాదు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇక్కడే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. గెస్ట్ హౌస్ లో అద్దెకు ఉంటున్నందుకు రాజకీయ ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా సహించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాలన్నీ వేగం పుంజుకుంటున్న తరుణంలో రెండు మూడు ఏళ్లలో నగరానికి రూపురేఖలు వస్తాయని ఆశిస్తున్న తరుణంలో.. ఈలోగా తన నివాస భవనం కూడా పూర్తి చేసుకోవడానికి వీలుగా స్థలాన్ని కొనుగోలు చేసి పనులు మొదలు పెడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ఈ వ్యత్యాసం ప్రజలు గమనిస్తున్నారు.