కెసిఆర్ కూడా జగన్ స్కోరుకు చేరుతారా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరినీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రజలు అధికార పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ ఇద్దరూ కూడా విపరీతమైన అహంకారంతో చెలరేగిపోయి, ప్రజల తిరస్కారాన్ని మూట కట్టుకున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒకరికొకరు అత్యంత సన్నిహితులు! పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు! ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు వంటి వారు.. అనే పోలికతో ఇరుగుపొరుగు రాష్ట్రాల నాయకులుగా చలామణి అయ్యారు! అయితే ఎన్నికల ఫలితాలను ఎదుర్కొన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాస్త మెరుగైన ప్రదర్శన చూపెట్టారు. ఇంచుమించుగా మూడోవంతు సీట్లను ఆయన గెలుచుకుంటే, జగన్ మోహన్ రెడ్డి కనీసం 10శాతం సీట్లను కూడా నెగ్గలేకపోయారు. ఇప్పుడు భారాసనుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ దూకుడు చూస్తోంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి స్కోరుకే కేసీఆర్ కూడా రీచ్ అవుతారేమో అనిపిస్తోంది. 

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తుడిచిపెట్టేయడం మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. తాము గేట్లు తెరిస్తే భారత రాష్ట్ర సమితిలో తండ్రీకొడుకులు తప్ప ఇంకెవరూ మిగలరని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల గందరగోళం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఫిరాయింపుల మీద దృష్టి పెట్టింది. ఒక్కరొక్కరుగా బిఆర్ఎస్ జట్టు నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తమ పిడికిటి నుంచి జారిపోకుండా కాపాడుకోవడం గులాబీ దళపతి కేసీఆర్ కు కష్టసాధ్యంగా మారుతోంది. 

పోచారం వంటి ఒక నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రాన మా పార్టీకి నష్టం లేదు.. సంజయ్ కుమార్ వంటి నాయకుడు వెళ్లిపోయినంత మాత్రాన మా పార్టీకి నష్టం లేదు.. అంటూ ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతి సందర్భంలోనూ ఒక డైలాగు వల్లించడం తప్ప గులాబీ దళ నాయకులు కేసీఆర్, కేటీఆర్ మరేమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జట్టులో చేరారు. మరింత మంది ఆ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కాగా కేసీఆర్ విడతలు విడతలుగా కొందరు ఎమ్మెల్యేలను పిలిపించుకొని వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతూ పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నదని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదివరకైతే నాయకులు ఆ మాటలను నమ్మేవాళ్లేమో కానీ, పార్లమెంటు ఎన్నికలలో ఒకవైపు తండ్రి కొడుకులు మేం 16 స్థానాలు సాధించబోతున్నాం అని పదేపదే డప్పు కొట్టుకున్న తర్వాత కూడా కేవలం ఒక్క సీటు కూడా సాధించకుండా సున్నకే పరిమితం కావడం వారి పార్టీ పరువు తీసింది. నాయకుల్లో ఉన్న నమ్మకాన్ని శిథిలం చేసింది. ఇలాంటప్పుడు కొత్తగా కేవలం మాటలు చెప్పడం వలన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టం అనే వాదన వినిపిస్తోంది సహజంగా ఎక్కువమంది అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండగా అక్కడ ఎంట్రీ దొరకని వారు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరితే మేలని భావిస్తున్నారు. ఈ ఫిరాయింపులన్నీ పూర్తయ్యేసరికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి సాధించిన స్కోరు 11 దగ్గరికే ఆయన పితృ సమానుడైన కేసీఆర్ ఎమ్మెల్యేల స్కోరు కూడా చేసుకుంటుందని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories