ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కుంభకోణంలో కర్త కర్మ క్రియగా పేరుపడ్డ నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇప్పటికి కాస్త క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. అజ్ఞాతంలో ఉన్నంత మాత్రాన. తాను కలకాలం తప్పించుకోవడం సాధ్యం కాదని ఆయన భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి విచారణకు వెళ్లి.. ఆరోపణలు మొత్తం తన మీదికే నెట్టేయడం.. తన తండ్రిని కూడా పోలీసులు వదలకుండా విచారించి.. మీ కొడుకును రమ్మని చెప్పండి మీకే మంచిది అంటూ హెచ్చరించి పంపడం ఇవన్నీ కూడా కసిరెడ్డిలో భయం పెంచినట్టుగా కనిపిస్తోంది. అరెస్టు నుంచి రక్షణ పొందాలనే లక్ష్యంతో ఆయన ప్రస్తుతం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి వారి మీదనే దింపుడుకళ్లెం ఆశలు పెట్టుకుని ఉన్నారు.
ఆయనలో భయం పుట్టిన సంగతి స్పష్టంగానే కనిపిస్తున్నది గానీ.. మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. జగన్ హయాంలో ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం పాలసీతో సంబంధం లేదని ఆయన అక్కడ కూడా అదే పాట పాడుతున్నారు. పోలీసులు అనవసరంగా తన పేరు ఇరికించారని అంటున్నారు. మార్చి 25, 28 తేదీల్లో జారీచేసిన నోటీసుల్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
ఇదే విషయంపై ఆయన గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసు కొట్టేయలేమని, విచారణ చేయకుండా పోలీసుల్ని ఆదేశించలేమని పేర్కొంటూ ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సదరు హైకోర్టు ఉత్తర్వులను కూడా కొట్టివేయాలని ఆయన సుప్రీంను కోరుతున్నారు. తాను హైదరాబాదులో ఉన్నానుగనుక, తనను విజయవాడకు విచారణఖు రావాల్సిందిగా ఆదేశించడం కరెక్టు కాదని రాజ్ కసిరెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
కసిరెడ్డి వాదన ఎలా ఉన్నదంటే.. లిక్కర్ స్కామ్ లో డబ్బు స్వాహా జరిగితే.. ఆ డిపార్టుమెంటులో ఉన్నవారిని తప్ప మరెవ్వరినీ విచారించడానికి వీల్లేదు అన్నట్టుగా ఉంది. వారికి తప్ప మరెవ్వరికీ పాత్ర ఉండదు అని చెబుతున్నట్టుగా ఉంది. నేను ఐటీ సలహాదారును గనుక.. నాకేంటి సంబంధం అంటూ గోరోజనం ప్రదర్శిస్తే కుదరదు.. విచారణకు హాజరైన తనకు సంబంధం లేదనే సంగతిని ఆయన సాధికారికంగా నిరూపించుకోవాలని అని ప్రజలు అంటున్నారు.
అజ్ఞాతంలోంచి బయటకు రాకుండా కలకాలం ఉండలేనని ఆయనకు అర్థమైంది. బయటకు వచ్చి విజయసాయికి కౌంటరు ఇవ్వాలని కోరిక కూడా ఉంది. కానీ బయటకు వస్తే అరెస్టు చేస్తారని భయం. సుప్రీం తన కోరికను మన్నిస్తుందనే నమ్మకం లేకపోయినప్పటికీ దింపుడు కళ్లెం ఆశతో ఆయన అక్కడ పిటిషన్ వేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.