విజయసాయి పుట్టుమచ్చలు సహా సిద్ధం చేస్తున్న కసిరెడ్డి!

పిట్టపోరు పిట్టపోరు పిల్లికి లాభించినట్టుగా ఉంది పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగుతున్న నాయకులు- ఆల్రెడీ బయటకు వచ్చేసిన నాయకులు.. ఒకరి మీద ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటూ.. వారి వారి అవినీతి బాగోతాలను బయటపెట్టుకోవడానికి చూపిస్తున్న ఉత్సాహం ఇప్పుడు విచ్చలవిడిగా కనిపిస్తోంది. వైసీపీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు.. కూటమి ప్రభుత్వానికి లాభించేలా ఉన్నాయి. వారికి ఎలాంటి శ్రమ, ప్రయాస లేకుండానే.. వైసీపీ నేతలు పాల్పడిన అవినీతి అక్రమాల చిట్టా మొత్తం.. వాటికి సంబంధించిన ఆధారాలు మొత్తం ప్రభుత్వానికి అందివచ్చేలా కనిపిస్తోంది.

శుక్రవారం సిట్ విచారణకు సాక్షిగా హాజరైన విజయసాయిరెడ్డి.. రాజ్ కసిరెడ్డి మహా మోసగాడు అని.. తన బంధువులు, మిత్రుల ద్వారా వసూళ్ల నెట్ వర్క్ మొత్తం నడిపించాడని.. మిగిలిన వారి పాత్ర తెలియదని తేల్చి చెప్పారు. విజయసాయి మాటలను బట్టి చూస్తే.. మొత్తం లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి పాత్రే అందరి కంటె చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అర్థం అవుతోంది. అయితే 24 గంటలైనా గడవక ముందే కసిరెడ్డి రాజశేఖర రెడ్డినుంచి కౌంటర్ వచ్చింది. కేసు సంగతి ఇప్పుడు పక్కకు పోతోంది.. విజయసాయిరెడ్డి మీదనే ఎదురుదాడికి దిగుతున్నారు కసిరెడ్డి. త్వరలోనే మీడియాను పిలిచి విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం బయటపెడతానని కసిరెడ్డి అంటున్నారు.|

సిట్ పోలీసులు కసిరెడ్డిని విచారించే ప్రయత్నం ప్రారంభించిన నాటినుంచి.. ఆయన పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. భార్య, మరదలుతో సహా ఆయన పరారయ్యారు. రెండు సార్లు పోలీసులు నోటీసులు ఇస్తే పట్టించుకోలేదు. ఐటీ సలహాదారునైన నాకు లిక్కర్ స్కామ్ నోటీసులు ఎలా ఇస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. అరెస్టునుంచి రక్షణ కావాలని హైకోర్టుకు వెళ్లి భంగపడ్డారు. పరారీలోనే ఉండగా.. మూడోసారి, నాలుగోసారి కూడా పో లీసులు నోటీసులు ఇచ్చారు.

అయితే విజయసాయిరెడ్డి విచారణకు  హాజరై.. రాజ్ కసిరెడ్డి పెద్ద క్రిమినల్ బ్రెయిన్ ఉన్న మోసగాడు అంటూ పార్టీని ప్రజలను మొత్తాన్ని మోసం చేశాడని, తనకు తెలియక అతడిని ప్రోత్సహించి తప్పు చేశానని చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత.. రాజ్ ఒక ఆడియోను విడుదల చేశారు. అందులో.. ‘సిట్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి న్యాయరక్షణ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని, సుప్రీం ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నానని’ ఆయన చెప్పుకొచ్చారు.  మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా విజయసాయి ఆరోపణలు చేశారంటూ కొత్త పాట ఎత్తుకున్నారు. విజయసాయి ఆరోపణలపై త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబుతా అంటున్నారు.

ఇవాళ రాజ్ అవినీతి గురించి విజయసాయి, రేపు విజయసాయి అవినీతి గురించి రాజ్ కసిరెడ్డి రహస్యాలన్నీ బయటపెట్టిన తర్వాత.. కూటమి ప్రభుత్వం ఇరువురినీ కూడా కటకటాల వెనక్కు పంపడం సులువు అయిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా కేసుల్లో నమోదుకాని అనేక రహస్యాలు కూడా వెలుగులోకి వస్తాయని అనుకుంటున్నారు. విజయసాయి చేసిన దందాలు, అరాచకాల గురించి రాజ్ కసిరెడ్డి ఎక్కడెక్కడి రహస్యాలన్నీ కూడా పోగు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories