సరికొత్త లిక్కర్ పాలసీ రూపంలో ప్రజాధనాన్ని ఏరకంగా దోచుకోవచ్చునో డిజైన్ చేసిన మేధావిగా.. ఆ దోపిడీ పర్వాన్ని సమర్థంగా నడిపించిన ఆచరణశీలిగా.. వైసీపీ నాయకులలో ఆయనకు గుర్తింపు ఉంది. కుట్ర రాజకీయాలలో.. లీగల్ గా ఒక పట్టాన అంతుచిక్కకుండా తప్పుడు మార్గాల్లో అవినీతి దందాలని నడిపించడంలో ఆయన మహా మేధావిగా పార్టీ నాయకులు గౌరవిస్తూ ఉంటారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా అధికారిక గుర్తింపు ఉన్న వ్యక్తి గనుక ఇష్టారాజ్యంగా చెలరేగుతూ వచ్చారు. అటువంటి రాజ్ కసిరెడ్డి- ఇప్పుడు లిక్కర్ కుంభకోణం పై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణకు పిలిస్తే రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎన్ని చిన్నెలు ప్రదర్శించినప్పటికీ ఆయన సిట్ విచారణకు హాజరుకాక తప్పదని రాజకీయ వర్గాలలో పలువురు అంచనా వేస్తున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయులైన బంధువులలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకరు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్రితులకు అడ్డదారుల్లో దోచిపెట్టేక్రమంలో భాగంగా ఆయనకు ప్రభుత్వ ఐటీ సలహాదారు పదవిని అప్పగించారు. ఆయన తనకు అప్పగించిన ఐటీ శాఖా పరంగా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సలహాలు చెప్పారో ఎవరికీ తెలియదు కానీ, కొత్త లిక్కర్ పాలసీని అడ్డదారులకు అనుకూలంగా తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు ఏర్పాటు చేయించి ధరలు పెంచేలా చేసి పెంచిన ధరలన్నింటినీ ముడుపుల రూపంలో తమకు సమర్పించుకునే తయారీ సంస్థలకు మాత్రమే ఆర్డర్లు ఇస్తూ.. కంటికి కనిపించని అతిపెద్ద దందాకు కేంద్ర బిందువుగా ఉన్నారు. తీరా కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ గురించి లోతుకు తవ్వుతూ జరిగిన అవినీతిని నిర్ధారిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇస్తే ఇప్పటికి రెండుసార్లు ఆయన డుమ్మా కొట్టారు. హైకోర్టుకు వెళ్లారు గానీ ఆయనకు అనుకూల తీర్పు రాలేదు. తాజాగా ఏప్రిల్ 9న విచారణకు రావాలని సిట్ మూడోసారి ఆయనకు నోటీసులు పంపింది. దీనిని కూడా పరిగణన రాజ్ తీసుకోకపోతే ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకొని అవకాశం ఉంది.
అయితే రెండోసారి నోటీసులు అందుకున్నప్పుడు తనను ఎందుకు విచారణకు పిలుస్తున్నారో కారణాలు చెబితే తప్ప రాబోనని రాజ్ కసిరెడ్డి మొండికేసిన వైనం కూడా చిత్రంగా ఉంది. తాను ఐటీ సలహాదారు గనుక.. మద్యంకుంభకోణం గురించి ఏమీ తెలియదని, అసలు దానితో సంబంధమే లేదని ఆయన బుకాయిస్తూ ఒక మెయిల్ పెట్టారు. సిట్ కు తనను విచారించే అధికారమే లేదని ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు దానిని కొట్టివేసింది. సిట్ నోటీసులకు విచారణార్హత ఉన్నదని తేల్చింది. ఇప్పుడు విచారణకు వెళ్లాలంటే రాజ్ కసిరెడ్డి ఆందోళన చెందుతున్నారని అర్థమవుతోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ నిందితుల భరతం పట్టడంలో ఆదిలో ఇలాంటి హంసపాదులు ఎదురవుతున్నాయి గానీ.. ఒకసారి విచారణలు ప్రారంభం అయ్యాక.. వైసీపీ పెద్దతలలు పలువురు కటకటల్లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.