కారుమూరి మాటలు వైసీపీకే మరణశాసనాలు!

‘మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. ఇంతకింతా తిరిగి వడ్డీతో సహా చెల్లించుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ ఇలాంటి మాటలు మనం వైసీపీ నాయకుల నుంచి చాలా తరచుగా గమనిస్తూ ఉంటాం. చేసిన తప్పుల గురించి పోలీసులు కేసులు పెడితే.. అక్కడికేదో తెలుగుదేశం  పార్టీ వారు పగబట్టి చేయిస్తున్న వ్యవహారాల్లాగా పరిగణించి వారి మీద విరుచుకుపడడం ఒక రివాజుగా మారింది. ఇలాంటి దుడుకు వ్యవహారాల్లో.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తాను రెండాకులు ఎక్కువే చదివానన్నట్టుగా మాట్లాడుతున్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరికి పారేస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మాటలతో ప్రజల్లో వ్యతిరేకభావాన్ని పెంచుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణశాసనం రాస్తున్నారని ఆ పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మాజీ మంత్రి కారుమూరి తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తన మాటలు వారికి ఏ రకంగా స్ఫూర్తినివ్వాలని ఆయన కోరుకున్నారో గానీ.. ఇటీవల ఆయన వెళ్లి.. చిత్తూరు జిల్లాలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన వైనం అక్కడ గుర్తుచేశారు. పెద్దిరెడ్డి విపరీతమైన భూఆక్రమణలు, కబ్జాలకు సంబంధించిన కేసులను ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఇుక, లిక్కర్ కుంభకోణాల్లో పెద్దిరెడ్డి తండ్రీ కొడుకులు పూర్తిగా ఇరుక్కునే వాతావరణం కనిపిస్తోంది. ఆయనను కలిసిన తర్వాత.. కారుమూరికి ఒక విషయం అర్థమైందట.

జగన్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే ఒక విషయం గ్యారంటీ అని ఆయన అంటున్నారు. గుంటూరుకు ఇవతల (అంటే గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర వైపు) తెలుగుదేశం వారిని ఇళ్లలోంచి బయటకు లాగి కొడతారట. గుంటూరుకు అవతల (ప్రకాశం నుంచి రాయలసీమ జిల్లాలన్నీ) నరికిపారేస్తారట.. కార్యకర్తల కేరింతల మధ్య ఆయన ఈ విషయాన్ని చాలా ఘనంగా ప్రకటించారు.

ఇప్పుడు కారుమూరి మాటలు సర్వత్రా వివాదాస్పదం అవుతున్నాయి
కారుమూరి నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో గతంలో కూడా గొప్ప ట్రాక్ రికార్డునే కలిగి ఉన్నారు. రైతుల్ని ఎర్రిపప్పలుగా తాను మంత్రిగా ఉన్నరోజుల్లో వ్యాఖ్యానించి ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ఆ మాటలు  సర్దుకోవడానికి ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థం వస్తుందని చెప్పుకున్నారు. హిందూపురం అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్స్ వివాదంలో చిక్కుకుంటే.. ఈ కారుమూరి.. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రెస్ మీట్ పెట్టి.. గోరంట్ల మాధవ్ చర్యలను సమర్థిస్తూ వెనకేసుకు వచ్చారు. తీరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారందరినీ తమ ప్రభుత్వం రాగానే నరికి పారేస్తారు అని వ్యాఖ్యానించడం ద్వారా.. ఆయన కొత్త వివాదానికి బీజం వేశారు.

ఒకవైపు పోలీసుల బట్టలూడదీసొ కొడతానని అంటున్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి డైలాగులు వేస్తున్న కారుమూరి లాంటి వారిని అదుపులో పెట్టుకోలేకపోతే.. ఆ పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటారని అంతా భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories