కన్నడలో రూపుదిద్దుకున్న ‘కాంతార’ సినిమా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆయన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల చూపును ఆయన వైపునకు తిప్పుకున్నాడు. ఆయన చేసిన పర్ఫార్మెన్స్‌కి విమర్శకుల ప్రశంసలు అందాయి.అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చి సత్కరించింది.
అయితే, ఈ హీరో తాజాగా బాలీవుడ్ సినీ పరిశ్రమపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ‘‘భారతదేశాన్ని కొన్ని చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన సినిమాలను అంతర్జాతీయంగా గౌరవిస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అందుకే మన సినిమాలకు ఇతర దేశాల్లో ఇంతటి ఆదరణ లభిస్తుంది. మన దేశం గర్వపడేలా సినిమాలను చేయాలని అనుకుంటున్నాను.’’ అని రిషబ్ శెట్టి కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
దీంతో ఈ విషయం గురించి బీటౌన్ ఆయనపై మండిపడుతోంది. ‘కాంతార’ చిత్రానికి బాలీవుడ్ జనాలు సైతం ఆదరణ చూపెట్టారని.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి రిషబ్ ఇలా మాట్లాడటం సరైన పద్దతి కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.