జగన్ బుద్ధిలో ఉండే కుటిలత్వం గురించి ఏదో రాజకీయ ప్రత్యర్థులు, ఆయనంటే కిట్టనివాళ్లు ఆరోపించడం మాత్రమే కాదు. స్వయంగా ఆయన కన్నతల్లి కూడా అదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. సరస్వతీ పవర్ షేర్ల బదలాయింపు విషయంలో తల్లికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చినవి చెల్లవని, అవి తనకు తిరిగి ఇవ్వాల్సిందేనని.. ట్రిబ్యునల్ ను జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ తల్లి విజయమ్మ తరఫు న్యాయవాది ఆమె తరఫు వాదనలు వినిపిస్తూ.. ఒకసారి తన వాటాలను గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేసిన తర్వాత.. మళ్లీ కంపెనీ వ్యవహారాల్లో వేలుపెట్టడం అనేది జగన్ కుటిలపన్నాగం అని కోర్టుకు నివేదించారు.
గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత.. ఏకపక్షంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)ను రద్దు చేసుకోవడం సాధ్యం కాదని.. ఇరుపక్షాలు అంగీకరిస్తే తప్ప అది కుదరదని ఆయన చెప్పారు. సెక్షన్ 59 ప్రకారం.. పిటిషన్ వేసి వివాదం చేయడం అనేది జగన్ కుటిల పన్నాగం అని వివరించారు.
సరస్వతి పవర్ రిజిస్టరులో వాటాదారుల పేర్లను సవరించి.. తమ వాటాలను పునరుద్ధరించాలంటూ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీ సంస్థలు.. ఆయన తల్లి విజయమ్మకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ లో పిటిషన్ వేశారు.
జగన్ తరఫు న్యాయవాది మాత్రం.. ఆస్తి బదలాయింపు చట్టం సెక్షన్ 122 ప్రకారం భౌతికంగా వస్తువులను అందజేసినప్పుడు మాత్రమే గిఫ్ట్ పూర్తయినట్టు అవుతుందని.. షేర్ల పత్రాలు తల్లికి ఇంకా ఇవ్వనేలేదు గనుక.. ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి తిరిగి వాటాదారుగా తనను చేర్చాలని ఆయన కోరుతున్నారు. చెల్లికి ప్రేమతో కానుక ఇవ్వాలని ఎంఓయూ చేసుకున్నారు గానీ.. ఆమె రాజకీయంగా వ్యతిరేక పక్షంలో చేరి తనపై ఆరోపణలు చేయడంతో ఎంఓయూ రద్దు చేసుకున్నారని ఆయన న్యాయవాది చెప్పారు.
ఎంఓయూ రద్దు అనేది ఇరుపక్షాల సమ్మతితోనే జరుగుతుందనే విజయమ్మ న్యాయవాదుల వాదనకు, జగన్ తరఫు వాదనలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. చూడబోతే జగన్మోహన్ రెడ్డి కుటిలబుద్ధితోనే.. తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా షేర్లు బదలాయించి.. షేర్ పత్రాలు మాత్రం ఇవ్వకుండా తన వద్దనే పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన మంచి బుద్ధితో వ్యవహరించి ఉంటే.. షేర్ల బదలాయింపుతో పాటు.. పత్రాలు కూడా ఇచ్చి ఉండేవారని.. కుట్రపూరితంగా ఆపారని అంతా అనుకుంటున్నారు.
జగన్ , భారతీ రెడ్డి బోర్డు డైరక్టర్లుగా రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత.. ఇక కంపెనీ వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకోవడమే తగదని అంటున్నారు. మొత్తానికి ఈ పిటిషన్ నడపడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి తన కన్నతల్లికి ఇచ్చిన గిఫ్టును తిరిగి తీసుకోవడం సాధ్యం అవుతుందో లేదో గానీ.. ఆయన పరువు మాత్రం పూర్తిగా పలచబడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.