కొత్తరెడ్డి కురచబుద్ధిపై కన్నకూతురి కౌంటర్లు!

‘ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపుగాదు’ అన్నాడు వేమన. అలాంటిది ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తన పేరును మార్చుకున్నంత మాత్రాన.. ఎవరికైనా బుద్ధులు మారిపోతాయా? మారవు గాక మారవు. ఆ విషయాన్నే  పునరుద్ఘాటిస్తున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డి కూతురు క్రాంతి! ఎన్నికల్లో తన పార్టీ వైసీపీ ఓడిపోయిన తర్వాత.. పవన్ కల్యాణ్ మీద సవాళ్లు విసిరి తాను కూడా ఓడిపోయిన తర్వాత.. ముద్రగడ పద్మనాభం- రెడ్డి గా పేరు మార్చుకున్నారు. పవన్ మీద మరీ అతిగా ఆయన రెచ్చిపోవడానికి ఒక పెద్ద కారణం అయిన, ఆయన కన్న కూతురు క్రాంతి ఇప్పుడు తండ్రి వ్యవహార సరళి మీద సెటైర్లు వేస్తున్నారు.

పవన్ కల్యాణ్ పార్టీలో చేరడానికి కూడా మంతనాలు జరిపి, బేరం కుదరక, చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్న పద్మనాభం కు సహజంగానే పవన్ మీద అక్కసు ఉండేది. దానికి తోడు… కన్నకూతురు క్రాంతి వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిసి తాను జనసేన పార్టీలో చేరుతానని అడిగింది. చాలా హుందాగా ప్రతిస్పందించిన పవన్ కల్యాణ్.. కుటుంబాలను విడగొట్టడం తన ఉద్దేశం కాదని.. కావాలంటే.. ఎన్నికల తర్వాత అయినా ముద్రగడ ఇంటికే వస్తానని.. కుటుంబం మొత్తాన్నీ తన పార్టీలో చేర్చుకుంటానని అన్నారు. ఆ రకంగా తన సౌహార్దత చాటుకున్నారు. అప్పట్లో వైసీపీ కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్న ముద్రగడ.. ఆ వైఖరిని కూడా తప్పుపడుతూ పవన్ ను దారుణంగా నిందించారు. నా కూతురును రోడ్డుకీడుస్తారా? నీ భార్యను కూడా రోడ్డు మీదకు తీసుకురాగలవా? అంటూ చాలా లేకిగా మాట్లాడారు.

తీరా పవన్ విజయం, ముద్రగడ- రెడ్డిగా మారడం.. తాజాగా మళ్లీ పవన్ ను నిందిస్తూ ఆయన వీడియో విడుదల చేయడం జరిగాయి. తాజాగా ‘మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి, పవన్ కల్యాణ్ ను ప్రశ్నించే అర్హత ఉందా’ అంటూ కూతురు క్రాంతి ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ఆయన రెడ్డిగా మారిన తర్వాత కాపుల గురించి ఆయనకు ఎందుకు అంటూ నిలదీశారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరోసారి పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి తండ్రిని హెచ్చరించడం విశేషం.

పాపం ముద్రగడ.. అనుచిత రాజకీయ లబ్ధిని కోరుకుని.. అయిన వారిని కూడా దూరం చేసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories