కమలంలో కన్నడ ‘గాలి’.. ఏపీలో కూటమికి మేలు!

ఎక్కడో ఏదో పరిణామం జరిగితే.. దాని ప్రభావం మరెక్కడో కనిపిస్తుండడం ఆశ్చర్యకరం ఎంతమాత్రమూ కాదు. అదే విధంగా ఇప్పుడు కర్నాటకలో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి బాగా లాభించే అవకాశం కనిపిస్తోంది. కర్నాటకలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు, గనుల వ్యాపారాలలో ఉద్ధండుడిగా పేరున్న గాలి జనార్దనరెడ్డి తిరిగి భారతీయ పార్టీలో చేరారు. ఈ రాజకీయ చేరిక.. ఏపీలో ఎన్డీయేకు మేలు చేయనుంది.

గాలి జనార్దన రెడ్డి గతంలో బిజెపిలోనే ఉన్నారు. ఆ పార్టీ తరఫున ఎంపీగాను, కర్ణాటక మంత్రిగానూ కూడా పనిచేశారు. తర్వాతి పరిణామాల్లో ఆయన బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారు. కన్నడ ఎన్నికల్లో ఆయన సొంత పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గాలి కీలక అనుచరులు మాత్రం బిజెపిలోనే కొనసాగుతూ వచ్చారు. సుదీర్ఘకాలం విరామం తర్వాత గాలి జనార్దనరెడ్డి తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే గాలికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా పార్టీ కొన్ని నియోజకవర్గాల బాధ్యత అప్పగించినట్టుగా తెలుస్తోంది.

కన్నడ ఎంపీ ఎన్నికల్లో గాలి ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏపీలోని కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో ఆయన ముద్ర తప్పకుండా ఉంటుంది. బళ్లారి కేంద్రంగా గనుల వ్యాపారం విస్తృతంగా నిర్వహించిన వ్యక్తి గాలి జనార్దనరెడ్డి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆయన ప్రభావం చాలా వరకు ఉంటుంది. అలాగే చిత్తూరు, కడప జిల్లాల్లో జనార్దనరెడ్డి బంధువర్గం కూడా విస్తృతంగా ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే గాలి జనార్దనరెడ్డి అత్తగారి ఊరుకూడా ఉంటుంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. గాలి జనార్దనరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితులు. గతంలో వీరిద్దరి మధ్య సోదరబంధం ఉన్నట్టుగా వారేచెప్పుకున్నారు. అయితే తర్వాత తర్వాత..

జగన్ ద్వారా ఆశించిన ఆయన వ్యాపార ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ సరిహద్దు జిల్లాల్లోని గాలి ప్రభావాన్ని.. ఎన్డీయే కూటమికి అనుకూలంగా మళ్లించేలా పనిచేయాలని పార్టీ ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకుల్ని గెలిపించాలని చెప్పినట్టు సమాచారం. నిధులు సమకూర్చే విషయంలో కూడా సరిహద్దు జిల్లాల కూటమి అభ్యర్థులకు గాలి జనార్దనరెడ్డి తోడ్పాటు అందిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.  మొత్తానికి జగన్ తో పూర్వాశ్రమంలో అనుబంధం ఉన్న గాలి.. యిప్పుడు బిజెపి తరఫున కూటమికి అనుకూలంగా పనిచేస్తే అది వారికి డబుల్ బెనిఫిట్ అవుతుంది. జగన్ కు గాలి ద్వారా అందే సాయం దక్కదు. అదే సమయంలో కూటమి ఎక్కువగా లాభపడుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories