కమలం గేట్లు తెరిచింది.. వైసీపీ ఖాళీ అవుతుందా..?

రాజకీయాలలో గెలుపోటములు సహజం. ఒకసారి ఓడిపోయిన పార్టీ నాయకులు ఇంకొకసారి తమకు విజయం దక్కుతుందని నిరీక్షిస్తూ ఉంటారు. కానీ ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైనటువంటి దారుణమైన పరాజయానికి.. ఆ పార్టీ నాయకులు అందరూ పునరాలోచనలో పడుతున్న మాట వాస్తవం! జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క ఛాన్స్ అందిస్తే.. ఆయన ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని ఉంటారని వారు ఎవరు కూడా ఊహించనేలేదు. జగన్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత కారణంగా పదులకోట్ల రూపాయలు తగలేసినప్పటికీ కూడా ఓటమిపాలయ్యామనే బాధలో వైసిపి నాయకులు ఉన్నారు. పార్టీ ఓడిపోయినందుకు నాయకుడిలో ఏమైనా పశ్చాతాపం ఉన్నదా అంటే అది కూడా వారికి కనిపించడం లేదు. వాస్తవాలను గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు వారిని రోజురోజుకు విస్మయపరుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? లేక తమ రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ఆగిపోతుందా అనే భయంలో చాలామంది నాయకులు సతమతం అవుతున్నారు. వేరే పార్టీలలోకి వెళ్లడం తప్ప, రాజకీయ మనుగడ  కోరుకునేట్లయితే, మరొక ప్రత్యామ్నాయం లేదని అనుకుంటున్న వారికి ఇప్పుడు సదవకాశం లభిస్తోంది. వైసీపీ నాయకులను భారతీయ జనతా పార్టీ తలుపులు బార్లా తెరిచి ఆహ్వానిస్తుంది. తమ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉండేవారు వైసీపీ నుంచి వచ్చినట్లయితే తప్పకుండా చేర్చుకుంటాం అని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెబుతున్నారు. 

నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని విస్తరించాలంటే వారికి కూడా వేరే అవకాశం లేదు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్షేత్రస్థాయి బలం చాలా తక్కువ. పోయిన ఏడాది నాటికి 37 లక్షల సభ్యత్వాలు తమ పార్టీకి ఉన్నాయని వారు చెప్పుకుంటూ ఉంటారు కానీ.. వాస్తవంలో ఏ ఎన్నిక నిర్వహించినా అన్ని ఓట్లు కూడా రాలవని సంగతి వారికి కూడా తెలుసు. జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అనే ఒక లక్ష్యంతో ఏర్పడిన కూటమిలో భాగంగా ఉండబట్టి భారతీయ జనతా పార్టీ కొన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వంలో భాగంగా అధికారం చెలాయిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించి ఇంకా బలోపేతం చేయాలనే కోరిక వారికి లేకపోలేదు. 

అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి బిజెపి వైపు ఎవరూ రారు – అన్నది స్పష్టం. ఇక వైసిపి నాయకత్వం పట్ల అసంతృప్తితో వేగిపోతున్న వారిని.. అధికార కూటమిలో ఉంటే రాజకీయ మనుగడ సులువు అవుతుంది అనుకుంటున్న వారిని తమలోకి ఆహ్వానించేందుకు కమలదళం ప్రయత్నిస్తున్నది. పార్టీ సిద్ధాంతాలు నమ్మేవారు మాత్రమే రావాలని ఒక కండిషన్ పెడుతున్నారు. ఇది తుతుమంత్రం నిబంధన అనే సంగతి అందరికీ తెలుసు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అరాచకమైన వ్యవహార సరళికి అలవాటు పడిన నాయకులు.. క్రమశిక్షణ గల పార్టీగా పేరున్న బిజెపిలోకి వస్తే ఆ పార్టీ తట్టుకోగలుగుతుందా అనేది వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories