కమల వ్యూహం : మన సాయం ప్రజలకు తెలియాలి!

విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లండి.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కట్టుబడి ఉన్నదో.. ఎంతెంత నిధులు కేటాయిస్తున్నదో విస్తృతంగా ప్రచారం చేయండి. రాష్ట్రవ్యాప్తగా భాజపాను బలోపేతం చేయండి.. కేంద్రంలోని మోడీ సర్కారు తలపెట్టడం వల్లనే.. ఏపీలో పెండింగ్ పనులన్నీ వేగవంతం అవుతున్నాయనే విషయాన్ని ప్రతి పౌరుడికీ తెలిసేలా చెప్పండి.. అని కమలనాథులు రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు భారీగా ఉన్న నేపథ్యంలో.. కేకులు కట్ చేసి కమలనాయకులు పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో.. వారి మీద పార్టీ నిర్మాణ బాధ్యత కూడా బాగా పెరుగుతోంది.

ప్రత్యేకహోదా ను ఏపీకి ఇవ్వకుండా వంచించినందుకు కేంద్రంలోని మోడీ సర్కారు, బిజెపి పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో బాగా విముఖత ఏర్పడింది. పైగా 2019 ఎన్నికలకు పూర్వం.. బిజెపితో తెగతెంపులు అయ్యాక.. చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాటాలతో మోడీ సర్కారు వైఖరిని ఎండగట్టారు. మొత్తానికి బిజెపి ప్రాభవం ఈ రాష్ట్రంలో కొడిగట్టిపోయింది. ఆ పార్టీ మళ్లీ ఎప్పటికీ కోలుకోవడం కష్టం అనే స్థాయికి ప్రజల్లో వారిపట్ల విద్వేషం పెరిగింది.

తెలుగుదేశంతో జట్టుకట్టడం వల్ల.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వారికి లాభం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావడం మాత్రమే కాదు.. అసలు కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి తెదేపా కీలకం అయింది. అయినా సరే.. ఏపీలో తమ పార్టీని క్రమంగా బలోపేతం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. కూటమిగా ఉండడం ఓకేనేగానీ.. రాష్ట్రంలో తమకు ఆదరణ పెంచుకోవాలనే కోరిక బిజెపి వారిలో ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర కేటాయింపుల గురించి ప్రతి మారుమూల గ్రామానికి తెలిసేలా.. అంతా మోడీ ఘనత అని ప్రచారం జరిగేలా ప్రతి పార్టీ కార్యకర్త కూడా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

ప్రత్యేకహోదా అనే మాటను తెలుగు ప్రజలు మరచిపోయేలాగా.. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన ప్యాకేజీలను, అమరావతికి, పోలవరానికి ఇస్తున్న నిధులను గురించి ప్రచారం చేయాలంటున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు అమరావతి రాజధానికి అనుకూలంగా చాలా విస్పష్టమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో.. దానికి తాము మరింతగా నిధులిస్తే తమ పార్టీని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో బిజెపి ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories