కలిదిండి రాజు గారిది సింగిల్ పాయింట్ ఎజెండా!

సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వస్తే చాలా రకాల ఎజెండాలు పెట్టుకుని పనిచేస్తారు. ఆర్థికంగా నెక్ట్స్ లెవెల్ కు ఎదగడం దగ్గరినుంచి, నాయకత్వం పరంగా, అధికారం పరంగా ఎదగడం గురించి పావులు కదుపుతూ ఉంటారు. వివిధ హోదాలు, పదవులు ఆశిస్తూ ఉంటారు. తద్వారా రాగల ప్రయోజనాలను లెక్కవేస్తూ ఉంటారు. కానీ.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కలిదిండి రఘురామక్రిష్ణరాజు మాత్రం సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. ఓ నెలరోజులు వ్యవహారాలను బాగా స్టడీచేసిన ఈ కలిదిండి రాజు.. తీవ్రమైన ఆరోపణలతో గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారిమీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆ కేసు అంతు తేల్చేదాకా.. దానికి సంబంధించి తాను ఆరోపించిన వ్యక్తులను విచారించే దాకా, వారికి శిక్షలు పడేదాకా విశ్రమించకూడదని ఆయన గట్టి నిర్ణయంతో ఉన్నట్టుగా ఉంది.

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత సీఎం జగన్ తో విభేదించారు. జగన్ మీద తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడడం ప్రారంభించారు. ప్రభుత్వ పాలన గురించి నిశిత విమర్శలతో ఇంటర్వ్యూలు ఇస్తూ, యూట్యూబ్ వీడియోలు విడుదల చేస్తూ.. జగన్ దళాలను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. భరించలేకపోయిన జగన్ తన భక్తులైన పోలీసు అధికారుల్ని పురమాయించారు. ఆయన మీద రాజద్రోహం కేసులు బనాయించి సీఐడీని ఉసిగొల్పారు.

హైదరాబాదు నివాసంలో ఉన్న రఘురామను అరెస్టు చేసి తీసుకువచ్చి.. తీవ్రంగా హింసించారు. దీనిపై అప్పట్లోనే కోర్టుల్ని ఆశ్రయించి.. బెయిలు తెచ్చుకున్న రఘురామ.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత..  హత్యాయత్నం కేసు పెట్టారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఎం జగన్మోహన్ రెడ్డి, మరో సీఐడీ అధికారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటు మీద కేసులు పెట్టారు.

అప్పటినుంచి రఘురామ అదొక్కటే ఎజెండాగా తిరుగుతున్నారు. ఆయన మంత్రి పదవి అడగలేదు, స్పీకరు కలగన్నారు గానీ పట్టుబట్టలేదు. తనను కొట్టిన వారి భరతం పడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసు సంగతి త్వరగా తేల్చాలని ప్రెస్ మీట్లు కూడా పెట్టిన ఆయన తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీని కూడా కలిశారు. హత్యాయత్నం జరిగినట్టుగా తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఎస్పీకి అందజేశారు. తనకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అంటున్నారు.

తమాషా ఏంటంటే.. రఘురామ ఇప్పట్లో మీడియా వారు ఎవరు కలిసినా సరే.. తన మీద హత్యాయత్నం గురించి తప్ప మరో మాట మాట్లాడేలా లేరు. అది తేలితే గానీ.. మరో అంశం మీదికి దృష్టి సారించకూడదని పట్టుబట్టినట్టుగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories