కలుగులోనే కాకాణి.. ఇప్పట్లోకి బయటకు రాలేరు!

అరెస్టు చేస్తారనే భయంతో నోటీసులు అందుకోవడానికి కూడా భయపడి పోలీసుల కళ్లుగప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూ తిరుగుతూ కుటుంబంతో సహా పరారీలో ఉంటూ తలదాచుకుని బతుకుతున్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. ఇప్పట్లో దాక్కున్న కలుగులోంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు ఆయన ముందస్తు బెయిలు పిటిషను వేసుకుని ఉన్నారు. ఆ సంగతి ఇంకా తేలలేదు. నోటీసుల సంగతి, బెయిలు సంగతి  సరే.. అసలు పోలీసులు తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం దానిని డిస్మిస్ చేసింది.

అరెస్టు నుంచి రక్షణ అనే తీర్పు వచ్చినట్లయితే గనుక.. కనీసం అజ్ఞాతంలోంచి బయటకు రావచ్చునని భావించిన కాకాణికి ఇది గట్టి ఎదురుదెబ్బ. దీంతో.. ఆయన మరికొంత కాలం.. కలుగులోనే దాక్కుని పోలీసులతో దాగుడుమూతలు ఆడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు నెల్లూరు జిల్లా పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణ హైదరాబాద్ లోను, తమిళనాడు చెన్నైలోను, కర్ణాటక బెంగుళూరులోను ఆయనకోసం గాలిస్తున్నారు.

క్వార్ట్జ్ అక్రమ మైనింగుకు సంబంధించి.. కోట్లాది రూపాయల అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టుగా మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డిపై కేసులు నమోదై ఉన్నాయి. అక్రమతవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర ఆరోపణలపై పొదలకూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదై ఉంది. ఇందులో ఏ4 గా కాకాణి ఉన్నారు. కేసులు నమోదైనప్పుడు.. కాకాణి మేకపోతు గాంభీర్యంతో చాలా ప్రగల్భాలు పలికారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీసులను బట్టలూడదీయించి కొడతాం అని కూడా బెదిరించారు. తీరా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైన నాటినుంచి ఇప్పటిదాకా ఆయన పరారీలోనే గడుపుతున్నారు.

నెల్లూరులోని ఆయన రెండు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబం మొత్తం పరారయ్యారు. మరొకవైపు హైదరాబాదులో బంధువులతో ఉగాది చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోలీసులను రెచ్చగొట్టారు. వారు ఆ బంధువుల ఇంటికి వచ్చేలోగా అక్కడినుంచి కూడా పరారయ్యారు. అప్పటినుంచి పరారీలోనే గడుపుతున్నారు. ముందస్తు బెయిలు సంగతి అప్పుడే తేలేలా లేదు.

ఈలోగా ఆయన అరెస్టు విషయంలో తొందరపడకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని, పెట్టిన కేసును పూర్తిగా కొట్టేయాలని మరో అనుబంధ పిటిషన్ హైకోర్టులో వేశారు. దానిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేం అని తేల్చిచెప్పింది. ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది గనుక ఆయనకు హైకోర్టు ద్వారా ముందస్తు బెయిలు రావడం కూడా కష్టమేనని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories