కాకాణి గోవర్దన రెడ్డి.. ఇటీవలి కాలంలో అత్యంత వివాదస్పదుడైన నేత. గత ప్రభుత్వ కాలంలో తాను చేసిన తప్పుడు పనులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినందుకు ఆగ్రహించి పోలీసుల బట్టలు ఊడదీయించి కొడతానని బహిరంగంగా హెచ్చరించిన నాయకుడు ఈయన. సుదీర్ఘకాలం పరారీలో ఉంటూ కలుగుల్లో దాక్కుంటూ గడిపి చివరికి అరెస్టు అయి మొన్నటిదాకా జైల్లో గడిపారు. ఎట్టకేలకు బెయిలు లభించింది. అయితే బెయిలు షరతుల్లో కొంచెం పరస్పర విరుద్ధంగా ఉండడంతో హైకోర్టుకు వెళ్లి కాస్త సడలింపు కూడా తెచ్చుకున్నారు. అయితే ఆయన బెయిలు నిబంధనల్ని ఇప్పటికీ ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. దీని గురించి పట్టించుకోవాల్సింది ఎవరు? ఆయన తీరు గురించి న్యాయస్థానమే పట్టించుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, దందాలు సాగిస్తూ వందల కోట్ల రూపాయలు కాజేసీన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి కీలక నిందితుడు. అరెస్టు అయిన తర్వాత పలుమార్లు బెయిలు కోసం ప్రయత్నించిన ఆయనకు ఎట్టకేలకు లభించింది. అయితే కోర్టు పలు షరతులు విధించింది. ఆ షరతులు కొంతమేర పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అందులో ఒకవైపు ప్రతి వారం విచారణాధికారి వద్దకు వచ్చి హాజరు కావాలనే షరతు ఉండగా.. ఈ కేసులో చార్జిషీటు దాఖలు అయ్యేదాకా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదని మరో షరతు విధించారు.
వీటిపై హైకోర్టును ఆశ్రయించిన కాకాణి గోవర్దనరెడ్డి మొత్తానికి జిల్లాలో అడుగుపెట్టకూడదనే నిబంధనను కాస్త సవరించేలా చూసుకుని, జిల్లాకు రావడానికి అనుమతి తెచ్చుకున్నారు. అయితే ఈ షరతుల విషయం ఎలా ఉన్నప్పటికీ.. కాకాణి గోవర్దనరెడ్డి బెయిల్ నిబంధనల్ని అతిక్రమించి చేస్తున్న తప్పుల గురించి చెప్పుకోవాలి.
జైలు నుంచి విడుదల అయిన వెంటనే కాకాణి మీడియాతో మాట్లాడడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని, ఆయన బెయిలు షరతులపై హైకోర్టులో వాదనల సందర్భంగా పీపీ న్యాయమూర్తికి నివేదించడం గమనార్హం. పైగా జైలునుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియానుద్దేశించి కాకాణి మాట్లాడిన మాటలు.. కేసులో సాక్షిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేను బెదిరించేలా ఉన్నాయనే సంగతిని కూడా పీపీ న్యాయస్థానానికి గుర్తుచేశారు. ఆయన నెల్లూరు జిల్లాలోకి అనుమతించడం వలన దర్యాప్తును ప్రభావితం చేస్తారని పోలీసుల న్యాయవాది వాదిస్తున్నారు. ప్రతి ఆదివారం విచారణాధికారి వద్దకు వచ్చి.. ఆ వెంటనే తిరిగి జిల్లా విడిచి వెళ్లిపోయేలా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
నిబందనల సంగతి పట్టించుకోకుండా.. రెచ్చిపోయి మీడియాతో మాట్లాడడం, సాక్షులుగా ఉన్నవారిని బెదిరించేలా సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీటికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు? ఈ బాధ్యతను కూడా న్యాయస్థానాలే తీసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.