కేసు ఇప్పటిదికాదు. దశాబ్దానికి పైగా నడుస్తోంది. కానీ ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ వారు హైకోర్టు గడప తొక్కడం వల్ల.. సాంకేతిక పరిభాషలాగా కనిపించే ఈ కోడ్ భాష మొత్తం మళ్లీ ఒకసారి విని తెలుసుకోవాల్సి వస్తోంది. జగన్మోహన్ రెడ్డి దోపిడీపర్వం ఏయే రీతిగా సాగుతుండేదో తెలుసుకుని ప్రజలు నివ్వెరపోతున్నారు. ముడుపుల వ్యవహారం, క్విడ్ ప్రోకో దందాలు మొత్తం కోడ్ భాషలో సాగేవంటూ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. జగన్ ఉచ్చులో పడిన దాల్మియా సిమెంట్స్ వారు కోర్టును ఆశ్రయించడం ద్వారా వారు కోరుకున్న విముక్తి లభిస్తుందో లేదోగానీ.. జగన్ దోపిడీ పర్వం మాత్రం మరోసారి చర్చకు వస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో తమ మీద నమోదుచేసిన సీబీఐ కేసును కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ హైకోర్టును ఆశ్రయించింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం.. దాల్మియా సిమెంట్స్ కు అనుచిత మార్గాల్లో లబ్ది చేకూర్చినందుకు ప్రతిఫలంగా.. జగన్ కంపెనీల్లో వారు 95 కోట్ల రూపాయల ముడుపులు పెట్టుబడిగా పెట్టారని సీబీఐ కేసు నడుపుతోంది. భారతి సిమెంట్స్ లో దాల్మియా వాటాను పెంచి అప్పట్లో ఫ్రెంచి కంపెనీకి విక్రయించారు. 146.58 కోట్లు వచ్చాయి. అందులో పన్నులు పోగా 139 కోట్లు మిగిలింది. ఈ సొమ్మును ఖాతాల్లో చూపించకుండా హవాలా మార్గాల్లో జగన్మోహన్ రెడ్డికి రూ.55 కోట్లు అందించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ.
దాల్మియా ఉద్యోగి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ ఈ దందాల బాగోతాన్ని చాలా వరకు బయటపెట్టింది. అందులో ‘జేఆర్’ ఖాతాలోకి 55 కోట్ల లావాదేవీలు బయటపడ్డాయని, జేఆర్ అంటే జగన్మోహన్ రెడ్డేనని సీబీఐ అంటోంది. అలాగే ‘3500 టన్నులు అందాయి..’ అంటూ ఈమెయిల్ లో సాగించిన సంభాషణ యొక్క అర్థం 35 కోట్లు ముడుపులు అందినట్టే అని కూడా వారు తేల్చారు. అయితే ఈకేసును కొట్టేయాలని దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది.
జగన్ అక్రమార్జనలు, అవినీతి కేసులనుంచి ఇటీవల ఇండియా సిమెంట్స్ కు హైకోర్టు విముక్తి కల్పించింది. అదే తరహాలో తమకు కూడా విముక్తి లభిస్తుందని దాల్మియా సిమెంట్స్ కూడా ఆశిస్తుండవచ్చు. అయిదే వారి వాదన మాత్రం చిత్రంగా ఉంది. చట్టవిరుద్ధంగా అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం దాల్మియాకు లీజులు కేటాయించి ఉంటే గనుక.. అందుకు జరిమానాలు ఉంటాయి తప్ప.. శిక్షలు ఉండవు అని వాదిస్తున్నారు. వ్యవహారం కేవలం లీజులకు మాత్రమే పరిమితమైనది అయి ఉంటే బహుశా అలాగే అనుకోవచ్చు. కానీ ముడుపులు, ఆ సొమ్ములను హవాలా రూపంలో తరలించడం, అనుచిత లబ్ధిని కలిగించడం, అనుచిత ప్రయోజనం పొందడం ఇవన్నీ కేవలం జరిమానాలతో సరిపోయే విషయాలు కావని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.