అధికారంలో ఉన్నంత కాలం తెగ రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబు ఇంటిమీద దాడికి తెగబడిని కేసుకు సంబంధించి అరదండాలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ముందస్తు బెయిలు తెచ్చుకున్న జోగి రమేష్ కు ఆ సేఫ్ జోన్ ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఆయన స్వయంకృతమైన పొరబాట్లు, నిర్ణయాల కారణంగా ఆయన ముందస్తు బెయిల్ రద్దు కావొచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జోగిరమేష్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో వాదప్రతివాదాలు జరిగాయి. అయితే.. పోలీసు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించిన హైకోర్టు, అందుకే ఆయను ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు చెబుతున్నారని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో చెప్పడం విశేషం. బెయిల్ పిటిషన్ వాదిస్తున్న న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా జోగి రమేష్ పక్కనే పోలీసు విచారణ సమయంలో కూర్చుని.. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ తాను సమాధానాలు చెబుతున్నారని.. ఇది ఎక్కడా చూడలేదని లూథ్రా ఆరోపించడం గమనార్హం. దానికి సంబంధించిన వీడియోను కూడా న్యాయమూర్తికి చూపించారు.
అలాగే.. పోలీసులకు విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తానని కోర్టుకు హామీ ఇచ్చి ముందస్తు బెయిల్ తీసుకున్న జోగి రమేష్.. మూడు సార్లు విచారణకు నోటీసులు ఇస్తే ఒకసారి మాత్రమే హాజరయ్యారు. అలాగే.. 2021లో దాడిజరిగిన సమయంలో వాడిన ఫోను, సిమ్ కార్డు ఇవ్వాలని పోలీసులు అడిగితే అందుకు నిరాకరిస్తున్నారు. ఇవన్నీ కూడా విచారణకు సహకరించడం కానే కాదని కూడా పోలీసుల న్యాయవాది హైకోర్టులో చెబుతున్నారు.
విచారణ చురుగ్గా సాగుతున్న ఈ దశలో బెయిలు ఇస్తే ఆ ప్రక్రియకు అవరోధం కలుగుతుందని పోలీసులు అంటున్నారు, పోలీసులకు సహకరించకుండా.. ఇప్పటిలాగానే నోటీసులకు స్పందించకుండా, ఫోను, సిమ్ వంటివి స్వాధీన పరచకుండా జోగి రమేష్ తన ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తే గనుక.. ఆయనకు బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పలువురు అంటున్నారు. అదే జరిగితే తక్షణం అరెస్టు చేస్తారని కూడా అంచనా వేస్తున్నారు.