జేసీ ‘అన్ స్టాపబుల్’ నాయకుడా బాబుగారూ!

మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించే పర్వం కూడా పూర్తియంది. రేపు కొత్త యజమానులకు దుకాణాలను అప్పగిస్తారు. ఎల్లుండినుంచి రాష్ట్రంలో తిరిగి ప్రెవేటు లిక్కరు దుకాణాల వ్యాపారం మొదలవుతుంది. ఒక పర్వం ముగిసిపోయింది. కానీ.. తాడిపత్రి తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి మాట్లాడిన మాటలు వంటివి మాత్రం రికార్డుల్లో ఎప్పటికీ మిగిలిపోతాయి. ఇంత దారుణంగా తెలుగుదేశం నాయకులు లిక్కరు వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారా? అనే అభిప్రాయాలు ప్రజలకు కలుగుతాయి. చెడ్డపేరు తేగల వ్యక్తి ఒక్కరుంటే చాలు..  అచ్చంగా పార్టీ మొత్తాన్ని కలిపి నిందించడానికి ప్రత్యర్థులు సదా సిద్ధంగా ఉంటారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ.. తమ నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలు లాటరీలో ఎవరికి వచ్చినా సరే.. తనకు  లాభాల్లో 15 శాతం ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పేశారు. తాను ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే లాభాల్లో 15 శాతం ఇవ్వాలని, అలాగే మరో 20 శాతం వాటాకోసం తాను పెట్టుబడి కూడా పెడతానని, షాపు దక్కిన వాళ్లు ఆ మేరకు తనకు వాటా కూడా ఇవ్వాలని ఆయన హెచ్చరించారు.
ఇలా షాపు లాటరీలో ఎవరికి దక్కినా.. తనకు 35 శాతం వాటా ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు. అలాగే తాడిపత్రిలో బయటి వాళ్లు వచ్చి వ్యాపారం చేసుకుంటాం అంటే అనుమతించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇలాంటి హెచ్చరికలతో జేసీ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి తెదేపా ఎమ్మెల్యే కూడా ఇలాంటి దందా చేస్తుండకపోవచ్చు. కానీ.. జేసీలాంటి ఒక్కడు ఉండడం వలన… రాష్ట్రంలోని అందరు తెదేపా, కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు కూడా చెడ్డపేరు తప్పదనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది.
చంద్రబాబునాయుడు తొలినుంచి ఎమ్మెల్యేలను లిక్కర్ వ్యాపారం దరఖాస్తుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. సిండికేట్లు జరగకుండా చూడాలని కలెక్టర్లకు కూడా సూచిస్తు వచ్చారు. కేవలం చంద్రబాబు ఎఫర్ట్ వల్ల మాత్రమే కేవలం నాన్ రీఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 1800 కోట్ల రూపాయల లాభం వచ్చింది. సగటున ప్రతి దుకాణానికి 26 దరఖాస్తుల వరకు వచ్చాయంటే అది చంద్రబాబు శ్రద్ధ వల్లనే. కానీ జేసీ లాంటి నాయకులు చంద్రబాబు క్రమశిక్షణను ఉల్లంఘించడం అనేది పార్టీకి చేటు. జేసీ అన్ స్టాపబుల్ నాయకుడా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories