జగన్‌ను జర్మనీ వెళ్ళమంటున్న జనసేనాని!

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్న అత్యాశలకు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ఘాటైన వెటకారంతో సమాధానం చెప్పారు. ప్రజలు తనను సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే జీవించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా- తనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని, శాసనసభలో ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడడానికి సమయం కేటాయించాలని అనుచితమైన కోర్కెలతో అల్లరి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వెటకారపు కౌంటర్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి కనీసం తన ఎమ్మెల్యే గిరీని అయినా పదిలంగా చూసుకోవడానికి నానాపాట్లు పడవలసిన పరిస్థితి ఎదురవుతుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి నాటి నుంచి తనుకు ప్రతిపక్ష హోదా కావాలని నానాయాగీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాంప్రదాయం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల సీట్లలో 10 శాతం మించి బలం సంపాదించిన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ సంగతి తనకు తెలిసినప్పటికీ తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో అదే సిద్ధాంతాన్ని ఆయన పదేపదే ప్రవచించిన వ్యక్తి అయినప్పటికీ జగన్ ఇప్పుడు అర్థంపర్థం లేకుండా తనకు హోదా కావాలనే డిమాండ్తో నవ్వుల పాలవుతున్నారు.
ఈ హోదా అడగడం కోసం ఆయన చెబుతున్న లాజిక్ ఒకే ఒక్కటి! తెలుగుదేశం పార్టీ తర్వాత తమకు అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నది కనుక తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఎమ్మెల్యేల సీట్లలో పదో వంతు గెలవాలనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆ మాటకొస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి ఎలాంటి నిబంధన కూడా రాజ్యాంగం లో లేకపోవడం విశేషం.

ఓటింగ్ శాతం చూడమని అడుగుతున్న జగన్ అత్యాశ మీదనే పవన్ కళ్యాణ్ సెటైర్లు వేస్తున్నారు. ఆ దామాషాలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే.. జగన్మోహన్ రెడ్డి జర్మనీకి వెళ్లి అక్కడ రాజకీయాలు చేసుకోవాలని.. పవన్ కళ్యాణ్ హితవు చెబుతున్నారు.. జర్మనీ రాజకీయాల్లో బహుశా ఓటింగు శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఉన్నదేమో అని అర్థం వచ్చేలా పవన్ కల్యాణ్ వెటకారం ధ్వనిస్తోంది. మొత్తానికి అనర్హత వేటు పడుతుందా లేదా అనే మీమాంసలో టెన్షన్ పడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైనా ఫలం దక్కలేదేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories