పేర్ని వెంకట్రామయ్య అనే పేర్ని నాని.. ఒకప్పట్లో మంత్రిగా పనిచేసిన మాట నిజమే. జగన్ విధేయత ప్రదర్శించడంలో తనకంటూ ఒక ముద్ర ఉన్న ఆయన అప్పట్లో జిల్లా అంతటా తన భక్త గణాలను కీలక అధికార పదవుల్లో నియమించుకుని ఉండవచ్చు. అంతమాత్రాన రాష్ట్రంలో జగన్ దిగిపోయి ఎన్డీయే కూటమి ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత కూడా అంతా పేర్నికి అనుకూలంగానే వ్యవహారాలు నడుస్తుంటాయా? ఆయన మీద ఈగవాలకుండా.. అధికారులు ‘చాలా జాగ్రత్తగా’ చర్యలకు ఉపక్రమిస్తుంటారా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. పేర్ని వెంకట్రామయ్యకు చెందిన గోడౌన్లలో దాదాపు కోటి రూపాయల విలువైన పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారంలో అటు పౌరసరఫరాల శాఖ, ఇటు పోలీసు శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరు మొత్తం.. పేర్ని కనుసన్నల్లోనే నడుస్తున్నదేమో అనిపిస్తోంది. ఆయన భక్తులే ఇంకా అక్కడ పనిచేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. అందుకే ఆయన ఎంచక్కా కుటుంబం సహా చల్లగా జారుకుని.. కోర్టునుంచి బెయిలు వచ్చే దాకా నిరీక్షణ పర్వానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఎప్పటికప్పుడు లీజు గోడౌన్లలో ఉన్న బియ్యం సరుకును తనిఖీ చేసి నమోదు చేస్తూ ఉండాల్సిన అధికారులు ఆవిషయం పట్టించుకోలేదు. కాకినాడ స్మగ్లింగ్ బాగోతం బయటపడ్డాక.. తన బండారం కూడా తేలుతుందని ఆలోచించిన పేర్ని నాని.. స్వయంగా తన గోడౌన్లో బియ్యం మాయం అయ్యాయని ప్రభుత్వానికి లేఖ రాసేదాకా ఎవరూ పట్టించుకోలేదు.
ఆయన బియ్యం మాయం అయిన సంగతి నవంబరు 26న లేఖ రాస్తే, డిసెంబరు 4న తనిఖీలు చేశారు. డిసెంబరు 10న కేసులు నమోదు చేశారు. ఈలోగా పేర్నినాని ఎంచక్కా జేసీ ఆఫీసులో మాయమైన బియ్యానికి సంబంధించి కోటిరూపాయల చెక్కు కూడా ఇచ్చేశారు. కేసులకంటే ముందే పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లి బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తమాషా ఏంటంటే.. ఈ చర్యల క్రమం గమనిస్తే.. కృష్ణా జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తం పేర్నినాని ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతుంది. జిల్లాలోని నాయకులు ఎవ్వరూ కూడా.. పేర్నినాని బియ్యం బాగోతం గురించి నోరు మెదపడం లేదు.
గత ఎన్నికల్లో పోటీకూడా చేయకుండా.. కేవలం మీడియా ముందు విమర్శలకు మాత్రమే పరిమితమై.. ప్రస్తుతం వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం చూస్తే.. క్రియాశీల /ఎన్నికల రాజకీయాల నుంచి దాదాపు సన్యాసం తీసుకున్న పేర్ని నాని గురించి వీరంతా అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అందరూ అనుకుంటున్నారు.