వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా పరాజయం పాలై ఇప్పటికి ఆరునెలలు గడిచాయి. ఇప్పుడు ఎదురైన పరాజయం ధాటికి ఆ పార్టీకి ఇక భవిష్యత్తు కూడా ఉండదు అని ఆ పార్టీ నాయకులకే చాలా విపులంగా అర్థమై కూడా ఆరునెలల గడిచినట్టే. రకరకాల కారణాలు, కుల సమీకరణాల వల్ల.. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి గత్యంతరం లేని వాళ్లు మాత్రమే ఆ పార్టీలో ఇంకా కొనసాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో అక్రమ వ్యాపారాలు, బంధుత్వాలు, దందాల్లో వాటాలు కలిగిఉన్నవారు, కులసమీకరణాలతో ఆయనను తమ సొంతంగా భావిస్తున్న వారు మాత్రమే వైసీపీలో మిగులుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు పదిలంగా ఉండాలని కోరుకుంటున్న వారంతా జాగ్రత్త పడి ఎప్పుడో ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు. పార్టీని వీడిపోవడం అన్నది ఎన్నడో జరిగిపోగా.. తాజాగా ఇప్పుడు మళ్లీ కొందరు నాయకులు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? అనేది చర్చనీయాంశమే. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. జగన్ పిలుపు ఇస్తున్న ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడమూ, జగన్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఏర్పాట్లు చూడడమూ, ఆయా కార్యక్రమాలకు కార్యకర్తలను.. జనాన్ని సమీకరించడమూ.. ఖర్చులు భరించడమూ విషయంలో తేడాలు రావడం వల్లనే ఈ సమయంలో కొన్ని రాజీనామాలు జరుగుతున్నట్టుగా సమాచారం.
కలెక్టర్ల కార్యాలయాల వద్ద, విద్యుత్తు ఎస్ఈ కార్యాలయాల వద్ద పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమాలకు భారీగా జనసమీకరణ చేయాలంటూ పార్టీ నాయకత్వం నుంచి లోకల్ లీడర్లకు టార్గెట్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ స్థానిక నాయకులు.. ఇటీవల ఎన్నికల్లో పదుల కోట్లరూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ భారీగా ఖర్చు చేశారు. ఓడిపోయిన తర్వాత.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కుదువ పెట్టిన ఆస్తులు చేజారిపోతున్నాయి. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వస్తోంది. ఇలాంటి సమయంలో.. మళ్లీ జనసమీకరణలు, మళ్లీ లక్షల కోట్ల రూపాయల వ్యయం అయ్యేలా టార్గెట్లు పెట్టడం అంటే స్థానిక నాయకులు విసిగిపోతున్నారు. అందుకే ఈ టార్గెట్లు భరించలేక ఏకంగా పార్టీనే వీడిపోతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ టార్గెట్ల బెడదతోనే అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ రాజీనామాలు చేసినట్టు చెబుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని రాజీనామాలు ఉంటాయని కూడా అంటున్నారు.