జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. వినుకొండలో ఒక రౌడీషీటర్, వైఎస్సార్ కాంగ్రెస్ వ్యక్తిగత కక్షలవల్ల హత్యకు గురైతే.. దానితో శవరాజకీయం చేయడానికి ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బెంగుళూరు ప్యాలెస్ నుంచి ఉన్నపళంగా తరలివచ్చేసి, ఇవాళ వినుకొండ వెళ్లి పరామర్శ పేరిట ఒక డ్రామా నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి ఒక సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు. ఆ లేఖ ఆద్యంతం మహా కామెడీ ఆరోపణలతో సాగిపోయింది. అందులోని అంశాలు ఎలా ఉన్నాయంటే..
చంద్రబాబు పరిపాలన ప్రారంభించిన ఈ 45 రోజుల్లో ఇప్పటికే రాష్ట్రంలో 36 మంది హత్యకు గురయ్యారట. జగన్ ఏదో నోటికి వచ్చిన ఫిగర్ చెప్పేసి.. తన అనుచరులు వండి వార్చిన కాగితాలను చదివేసి బురద చల్లాలనుకుంటే కుదర్దు కదా? 36 హత్యల గురించి కనీసం వారి సొంత కరపత్రికలోనైనా తక్షణం ఓ కథనం వేయగల దమ్ము వారికి ఉందా? అనేది జనం సందేహం. ఒకవేళ జగన్ చాలా సత్యసంధుడు.. నిజాలు మాత్రమే చెబుతున్నాడని అనుకుందాం. మరి తన సొంత పార్టీ కార్యకర్తలు ఇప్పటికే 36 మంది హత్యకు గురైతే.. ఇవాళ రషీద్ కుటుంబాన్ని మాత్రం పరామర్శించడానికి జగన్ ఎందుకు వచ్చారు? మిగిలిన 35 మంది ఏం పాపం చేశారు? లేదా, మిగిలిన 35 హత్యలు ఎక్కడ జరిగాయో ఆయన వద్ద లెక్కలు లేవా? అనేది ప్రజలకు కామెడీగా కనిపిస్తోంది.
ఇంతకంటె కామెడీ ఏంటంటే.. టీడీపీ పాలన మొదలైన తర్వాత ఏకంగా 300 మంది మీద హత్యాయత్నాలు జరిగాయట. అంటే సగటున రోజుకు పది మంది వైసీపీ వారి మీద హత్యాయత్నాలు జరుగుతున్నట్టు లెక్క. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అలా కనిపిస్తున్నదా? కనీసం ఆయన సొంత కరపత్రికలోనైనా ఈ నెల రోజుల్లో అన్ని హత్యాయత్నం వార్తలు వచ్చాయా? క్లిపింగులు పెట్టి.. 300 హత్యాయత్నాలు అని సాధికారికంగా చెప్పగల ధైర్యం జగన్ కు ఉందా అనేది ప్రజల సందేహం.
అదే క్రమంలో ఇప్పటికే 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్ అంటున్నారు. ఆత్మహత్యల్ని కూడా రాజకీయంగా పులుముతున్నారు. టీడీపీ కార్యకర్తల వేధింపులు తాళలేక ఈ 35 ఆత్మహత్యలు జరిగాయట. చూడబోతే.. మొగుడూ పెళ్లాల గొడవలతో జరిగిన ఆత్మహత్యల్ని కూడా రాజకీయానికి తెలుగుదేశానికి ముడిపెట్టేలా జగన్ మాటలు ఉన్నాయని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలాగే ఇప్పటికే 1050కి పైగా దౌర్జన్యాలు దాడులు జరిగాయని విచ్చలవిడిగా ఏదో నోటికొచ్చిన లెక్కలన్నీ చెప్పి నవ్వులపాలవుతున్నారు జగన్.
అన్నింటికంటె పెద్ద కామెడీ ఏంటంటే.. 45 రోజుల పాలన అని జగన్ పదేపదే గొంతు చించుకుంటున్నారు. నిజానికి జులై 12 వ తేదీదాకా జగన్మోహన్ రెడ్డే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. చంద్రబాబు పాలన వయసు 34 రోజులు మాత్రమే! పెద్దగా ప్రయోజనం కలిగించని విషయాల్లో కూడా అతిశయాలు, అబద్ధాలు పేర్చి జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతారు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.