జగన్ తన మెడికల్ కాలేజీల డ్రామాను రక్తికట్టించడానికి నర్సీపట్నం వెళ్లాలనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. విశాఖలో విమానం దిగిన తర్వాత.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో నర్సీపట్నం వెళ్లాలనుకోవడమే ఆయన దురాలోచనకు నిదర్శనం. ఒకవైపు అదేరోజున విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, విశాఖనుంచి హెలికాప్టర్ లో వెళ్లాలని పోలీసులు పదేపదే కోరినా కూడా.. కాదని జగన్ పట్టుబట్టి రోడ్డు మార్గంలో వెళ్లడం వెనుక.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులను మభ్యపెట్టే దురాలోచన ఉంది.
పోలీసుల సూచనలు విన్నట్టే నటించి.. తన పర్యటన రూట్ మార్చుకోవడానికి ఒప్పుకున్నారు గానీ.. హెలికాప్టర్ లో వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు. అనుకున్న స్కెచ్ ప్రకారమే.. ఉక్కు పరిశ్రమ కార్మికులను చేతనైనంత మభ్యపెట్టి వెళ్లారు. గురివింద గింజ నీతి లాగా.. తాను పరిపాలించిన అయిదేళ్ల కాలంలో.. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతోంటే.. వాటివైపు కన్నెత్తి కూడా చూడకుండా.. పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు.. తన పర్యటన రూట్ లోకి కొందరు తన ముఠాకు చెందిన ఉక్కు పరిశ్రమ కార్మికులను రప్పించుకుని.. అసలు ప్రెవేటీకరణకు తాను తొలినుంచి వ్యతిరేకం అంటూ మొసలి కన్నీరు కార్చడం చిత్రమైన పరిణామంగా కనిపిస్తోంది.
విశాఖ ఉక్కు అనే సమస్య జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే గుర్తుకు వచ్చింది. నిజానికి ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ అనేది ముగిసిపోయిన సమస్య! మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సాక్షాత్తూ ఉక్కు శాఖ మంత్రి ఈ పరిశ్రమను స్వయంగా సందర్శించిన తర్వాత.. ప్రెవేటీకరణ ఆలోచనే కేంద్రానికి లేదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. కాకపోతే.. కొన్ని విభాగాలను మాత్రం అవుట్ సోర్సింగ్ పద్ధతికి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభాగాలను అవుట్ సోర్సింగ్ కు ఇవ్వడం ఏ సంస్థలో అయినా చాలా సహజంగా జరిగే వ్యవహారమే. అయితే, ఇప్పుడు ఆ వ్యవహారాల్ని వ్యతిరేకించడానికి జగన్ రెడ్డి కొత్త డ్రామాలను ప్రారంభించారు.
ఆయన పరిపాలన కాలంలో.. విశాఖ ఉక్కును ప్రెవేటీకరిస్తారనే భయం ప్రబలంగా ఉండేది. జగన్ అప్పుడు అధికారంలో ఉన్నారు. విశాఖ ఉక్కు కార్మికులు దీక్షలు చేస్తుండగా.. అయిదేళ్ల కాలంలో జగన్ గానీ, ఆయన పార్టీ వారు గానీ, తైనాతీలుగానీ.. వారి దీక్షలవైపు కనీసం చూపు సారించలేదు. నిజానికి జనసేనాని పవన్ కల్యాణ్ దీక్షాశిబిరాల్ని సందర్శించి వారికి అండగా ఉంటానని మాటఇచ్చారు. ఆ మాత్రం కూడా అధికారంలో ఉన్న జగన్ చెప్పలేదు. ప్రెవేటీకరణ జరిగిపోతే.. వేల ఎకరాల భూములను అమ్ముకోవచ్చునని జగన్ కుట్ర పన్నారు. కానీ, ఆ పప్పులుడకలేదు. సమస్య ఉన్న రోజున జగన్ వారిని పట్టించుకోలేదు.
ఇప్పుడు సమస్య లేకుండా తేలిపోగా.. తన యాత్ర లోకి కార్మికులను పిలిపించుకుని, ప్రెవేటీకరణకు తాను వ్యతిరేకం అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వ్యతిరేకం అయితే జగన్ ఏం చేయదలచుకున్నారు.. విశాఖ ఉక్కు కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా దీక్షలు చేయగల ధైర్యం ఆయనకు ఉందా? అలాంటి ప్రయత్నం చేయలేనప్పుడు.. కార్మికులకు ఇచ్చే హామీలు మభ్యపెట్టడమే కదా.. అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.