మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా విచిత్రమైన వాదనతో ప్రజల ముందుకు వచ్చారు. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం తేల్చడానికి సిట్ అవసరం లేదు.. బిట్ అవసరం లేదు అంటూ జగన్ విచిత్రంగా వాదిస్తున్నారు. ఒకవైపు ప్రత్యేక విచారణ జరిగేలా ఆదేశించాలని.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో.. సీబీఐ డైరక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ వేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట మారుస్తున్నారు. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో అసలు దర్యాప్తు అవసరమే లేదంటున్నారు.
నెయ్యి కల్తీ గురించి చంద్రబాబునాయుడు ఆరోపణలు చేసిన తర్వాత.. ఈ విషయంలో లోతైన దర్యాప్తు జరగాలని వైసీపీ నాయకులే కోర్టుకు వెళ్లారు. ఈలోగా చంద్రబాబు ప్రభుత్వం ఒక సిట్ కూడా ఏర్పాటుచేసింది. సుప్రీం విచారణ ప్రారంభించాక, వారి సూచన మేరకు డీజీపీ ఆ సిట్ ను రద్దుచేశారు. చంద్రబాబునాయుడు సొంతంగా ఏర్పాటు చేసిన సిట్ ను సుప్రీం కోర్టు రద్దు చేసేసిందని, మురిసిపోతూ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే సుప్రీం తుది తీర్పు.. అయిదుగురితో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశాల తర్వాత జగన్ భిన్నంగా మాట్లాడుతున్నారు.
‘తితిదేలో నమూనాల పరిశీలనకు ఒక ప్రక్రియ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దీనికి సిట్టు, బిట్టు అవసరం లేదు. ఏం జరగలేదని కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఈ ఆధారాలన్నీ చూసి అక్కడ ఏమీ జరగలేదనే చెప్పాలి’ అంటూ కొత్త సిట్ ఏం నివేదిక ఇవ్వాలనేది ఈ మాజీ ముఖ్యమంత్రి డిక్టేట్ చేస్తుండడమే తమాషా. తాను చెప్పినట్టు రిపోర్టు తయారుకాకపోతే.. దానికి కూడా ఆయన వద్ద ఒక వాదన సిద్ధంగా ఉంది. ‘రాజకీయ స్వార్థం కోసం తప్పుడు నివేదిక తయారుచేస్తే, తప్పుడు ప్రచారం చేస్తే.. వేంకటేశ్వరస్వామికి కోపం వస్తుంది. ఆయన చూసుకుంటాడు’ అంటూ జగన్ వ్యాఖ్యానించడం విశేషం.
నెయ్యి కల్తీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం ఆందోళన చెందుతోంటే.. ఇంత రాద్ధాంతం జరుగుతోంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు సిట్ అవసరమే లేదని, విచారణ అవసరమే లేదని, విచారణ చేసినా కూడా ఏం జరగలేదని నివేదిక ఇవ్వాలని వ్యాఖ్యానించడం విచిత్రమైన సంగతి. పైగా వేంకటేశ్వరుడితో ఆడుకుంటే, ఆయనే మొట్టికాయలు వేస్తారు అంటూ జగన్ చెబుతున్నారు. జగన్ మాటలన్నీ చంద్రబాబునాయుడు మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా దుర్బుద్ధితో నెయ్యి కల్తీ ప్రచారం చేశారంటూ సాగుతున్నాయి. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తిచూపిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని వ్యాఖ్యానించిందంటూ ప్రకటిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. సిట్ మాత్రం అవసరం లేదని అనడం చిత్రమైన సంగతి. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ అనగానే.. జగన్ దళంలో మునుపటి కంటె ఎక్కువ భయం ఏర్పడుతున్నదనడానికి ఇది నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.