తన అయిదేళ్ల పాలన అంత్యదశకు వచ్చిన చివరి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేకానేక డ్రామాలను నడిపించారు. అలాంటి వాటిలో విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు వ్యవహారం కూడా ఒకటి. ఫీజు రీఇంబర్స్‌మెంట్ వంటి పథకాల విషయంలో విపరీతంగా తన డప్పు తానే కొట్టుకునే జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల కోడ్ కు ముందుగానే ఫీజులు చెల్లించేస్తున్నట్టుగా బటన్లు నొక్కేశారు. ఆయన బటన్లు నొక్కారు గానీ.. ఖాతాల్లోకి డబ్బులు మాత్రం పడలేదు. ఆ రకంగా అప్పట్లో పెద్ద డ్రామా నడిపించారు. తీరా.. ఎన్నికలు పూర్తయి ఎన్డీయే సర్కారు ఏర్పడింది. తొలినాళ్లనుంచి జగన్ ఒకే పాట ఎత్తుకున్నారు. విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వారిని వేధిస్తున్నదంటూ ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. అయితే.. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన క్లారిటీని గమనిస్తే.. జగన్ ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన ఫీజు బకాయిల గురించి ఇక విద్యార్థులు మరచిపోవచ్చు. జగన్ పాపాలను అన్నింటినీ సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ విషయంలో జగన్ పాపాన్ని మోసే ఉద్దేశం లేదని అర్థమవుతోంది.
నారా లోకేష్ విలేకరులతో ముచ్చటిస్తుండగా.. ఫీజు బకాయిలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తమ వాటాగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు 800 కోట్లను ఆల్రెడీ చెల్లించేశాం అని లోకేష్ వెల్లడించారు. అదే సమయంలో జగన్ మూడువేల కోట్ల రూపాయలు సకాలంలో చెల్లించకుండా బకాయిపెట్టి వెళ్లిపోయారని కూడా అన్నారు. అన్యాపదేశొంగా.. జగన్ పెట్టిన బకాయిలను చెల్లించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
దీంతో విద్యార్థులకు ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. ఫీజు రీఇంబర్స్‌మెంట్ విషయం ఎత్తాలంటే.. ఇకమీదట వైసీపీ నాయకులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము అప్పట్లో బటన్లు నొక్కి డ్రామా చేసిన తర్వాత.. చెల్లించకుండా దిగిపోతే.. ఆ భారాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని మోయమని చెప్పడం భావ్యం కాదని ఆ పార్టీ వారికే అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి.. ఎలాంటి లాజిక్ తో నిమిత్తం లేకుండా.. ఏకపక్షంగా విమర్శలు చేసేసే.. మీడియా ప్రశ్నలకు కూడా జవాబులు ఇవ్వకుండా పారిపోయే అలవాటున్న వ్యక్తి గనుక చెల్లుబాటు అవుతోంది. లేకపోతే.. మూడువేల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిల గురించి ఏ ప్రెస్ మీట్లో ఆయనను ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పగలరు? అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్పటికీ రైతులకు, కాంట్రాక్టర్లకు, ప్రధానంగా ఉద్యోగులకు గత ప్రభుత్వ కాలంలో చెల్లించాల్సిన వేల కోట్లరూపాయలను జగన్ బకాయి పెట్టి వెళితే.. వాటన్నింటినీ తమ ప్రభుత్వం చెల్లిస్తున్నదని లోకేష్ వెల్లడించారు. జగన్ ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం ఇక రావు అని మానసికంగా సిద్ధపడి, రాష్ట్రంలోని విద్యార్థులు తమ ప్రత్యామ్నయాలు తాము చూసుకోవాలి. ఎన్డీయే ప్రభుత్వం ఎలాంటి బకాయి లేకుండా చెల్లిస్తున్నందుకు సంతోషించాలని ప్రజలు అనుకుంటున్నారు.