జగన్ అసలు బుద్ధి ఇప్పుడు బయటపడుతుంది!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన మీద ఉన్న సీబీఐ కేసుల నుంచి ఉపశమనం పొందుతూ రోజులు నెట్టేయడానికి, రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్రమోడీ ఎదుట సాగిలపడుతూ, అతి వినయం ప్రదర్శిస్తూ కాలం గడుపుతున్నారనేది చాలాకాలంగా వినిపిస్తున్న ఆరోపణ. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనూ ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగానే జగన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ కు దారుణ పరాజయం రుచిచూపించి.. భాజపా కూడా భాగమైన ఎన్డీయే కూటమి ఏపీలో రాజ్యమేలుతోంది.

ఈ నేపథ్యంలో ఆయన ఇంకా మోడీ పట్ల అతి, వీర విధేయతను కలిగిఉన్నారా? లేదా, తన ధిక్కార స్వరాన్ని వినిపించే ధైర్యం తెచ్చుకున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ విషయంలో ఆయన అసలు బుద్ధి ఏమిటో ఇప్పుడు తేలిపోనున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటుచేశారు. ప్రత్యేక ప్రతినిధి ద్వారా జగన్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే జగన్ ఆ సమావేశానికి వెళతారా? లేదా? అనేది ఆయన ఎత్తుగడలను బయల్పరచనుంది.

అందరూ అనుకుంటున్నట్లుగా డీ లిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. కొత్త జనాభా లెక్కల ప్రాతిపదికపై నిర్ణయిస్తే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గుతాయని.. ఆ మేరకు దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం పరంగా, కేంద్రం నుంచి దక్కే ప్రాధాన్యం పరంగా తీవ్రంగా నష్టపోతాయని ఒక వాదన ఉంది. ఈ వాదనపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఈ వాదానికి జై కొడుతున్నాయి. స్టాలిన్ వీటిని ప్రధానంగా ప్రస్తావిస్తుండగా.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక వారు దీనిని సపోర్ట్ చేస్తున్నారు.

ఈ సమావేశానికి స్థానం స్వయంగా రాలేకపోయినప్పటికీ, డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ ను పంపుతానని స్టాలిన్ కు సిద్ధరామయ్య వర్తమానం పంపారు. కేరళ లోని వామపక్ష ప్రభుత్వం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. అలా హాజరు కావడం అనేది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను తిరస్కరించినట్లు, తప్పు పట్టినట్లు అవుతుంది గనుక.. అదే కూటమిలో భాగమైన చంద్రబాబునాయుడు   మిన్నకుండిపోవడం తథ్యం.

అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఆయన మోడీ కూటమిలో లేరు. అయితే తన సిబిఐ కేసుల భయం కొద్దీ మోడీ పట్ల భయభక్తులను వీర విధేయతను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు స్టాలిన్ నిర్వహించే ధిక్కార సమావేశానికి వెళ్లి డి లిమిటేషన్కు వ్యతిరేకంగా తన గళం విప్పితే జగన్మోహన్ రెడ్డి  మోడీ ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది. అలాగని స్టాలిన్ సమావేశానికి వెళ్లకుండా కూర్చుంటే కనుక.. సిబిఐ కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని అందరూ నమ్ముతారు. మోడీకి కోపం వచ్చే ఏ పని చేయడానికి ఆయనకు ధైర్యం లేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రాజకీయంగా ఆయన అసలు బుద్ధి ఏమిటో ఇప్పుడు బయటపడుతుందని అందరూ భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories