జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అనుసరించడం అనేది ఆయన వ్యక్తిగత ఇష్టం. ఆ మతం ఆయనకు నచ్చింది.. ఆ మతంలో ఆయనకు ప్రయోజనం కనిపించింది ఆ మతాన్ని ఆయన పాటిస్తున్నారు. మతసంబంధితమైన ఈ అంశాన్ని హిందువులు ఎవరూ కూడా సీరియస్ గా పట్టించుకోవడం లేదు. పరిగణించడం లేదు. ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆ సంగతిని గుర్తించాలి. హిందువులందరూ జగన్ మతాన్ని పట్టించుకుంటే గనుక ఆయన ముఖ్యమంత్రి కాదు కదా జీవితంలో రాజకీయ నాయకుడే అయ్యేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాజకీయంగా ఏమాత్రం ఎదిగేవాడు కాదు. హిందువులు వారిని మతాలకు అతీతంగా ప్రజల మనుషులుగా చూశారు కాబట్టి మాత్రమే వారు రాజకీయ నాయకులు అయ్యారు. అలాంటి హిందువుల పట్ల వారు విశ్వసించే హిందుత్వం పట్ల కనీస గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా నీచంగా ఉంటున్నాయి.
తిరుమల ఆలయంలో అన్యమతస్తులు దైవదర్శనానికి వెళ్లాలంటే.. స్వామివారి పట్ల విశ్వాసం ఉన్నదని డిక్లరేషన్ ఇవ్వడం అనేది చట్టం. అది ఆ ఆలయంలో కనీస మర్యాద. దేవుడి పట్ల విశ్వాసం ఉన్నదని ప్రకటించడానికి ఇబ్బంది అయితే.. ఆ దేవుడి దగ్గరకు వెళ్లనే కూడదు. సాధారణంగా క్యూలైన్లో రోజుకు లక్ష మంది దర్శించుకునే దేవుడు వేంకటేశ్వరస్వామి! వారిలో అన్యమతస్తులు వెళ్లినా ఎవరూపట్టించుకోరు. సెలబ్రిటీలు మాత్రం డిక్లరేషన్ సంతకం పెట్టాల్సిందే. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం కూడా సంతకం పెట్టిన తర్వాతే దైవదర్శనానికి వెళ్లారు.
అలా సంతకం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి అహంకారం. తాను క్రిస్టియన్ అనే మాట చెప్పుకోవడానికి కూడా ఆయనకు అవమానం. ఆ మాట చెప్పరు. నేను ఇంట్లో బైబిల్ చదువుతా, బయట హిందువులా, ముస్లింలా ఉంటా.. లాంటి డొంకతిరుగుడు మాటలు మాట్లాడతారు. ఆయన మాటల్లో అన్నింటికంటె నీచత్వం ఏంటంటే.. ‘నన్నే ఇలా గుడిలోకి రానివ్వకపోతే దళితుల పరిస్థితి ఏమిటి’ అని ప్రశ్నించడం. దళితులందరూ హిందువులు కాదని, దళితులందరూ క్రిస్టియన్లని జగన్ సూత్రీకరిస్తున్నట్టుగా ఉంది. వారికోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారు.
పైగా.. తన తండ్రి వైఎస్సార్ డిక్లరేషన్ సంతకం చేయకుండా వెళ్లి పట్టువస్త్రాలు ఇచ్చారని, తాను కూడా అలాగే ఇచ్చానని డబాయిస్తున్నారు. తాము పాపాలు చేశాం గనుక.. అవే కొత్త నిబంధనలుగా పాటించాలని అంటున్నారు. జగన్ వైఖరి పట్ల హిందూ సమాజం మొత్తం ఈసడించుకుంటోంది.