తనకు చేతగాని పని కూటమి ప్రభుత్వం సాకారం చేస్తూ ఉండేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అసహనానికి గురవుతున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీ లను పిపిపి విధానంలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఎలాంటి అదనపు వ్యయంగానీ ఇబ్బందులు గాని, ఒడిదుడుకులు గాని లేకుండా విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే వైద్య కళాశాలలను ప్రారంభించే పేరిట తన జమానాలో ఒక పెద్ద డ్రామా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని సహించలేకపోతున్నారు. పదేపదే మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నారంటూ, పిపిపి అనే పదానికి అర్థం తెలియని అజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలకు అసహ్యం కలిగిస్తున్నాయి. అదే సమయంలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలకు కుదిరిన కాంట్రాక్టులు, ఒప్పందాలు అన్ని రద్దు చేస్తాను అని వైయస్ జగన్ ప్రకటించడం చాలా ప్రమాదకరమైన సంగతి. అయితే ఇలాంటి బెదిరింపు ప్రకటనలు ఆయనకే ఆత్మహత్యాసదృశ్యం అని పలువురు భావిస్తున్నారు.
జగన్ తన ప్రభుత్వ కాలంలో.. మెడికల్ కాలేజీల ప్రారంభం పేరిట ఆర్భాటం చేశారు తప్ప.. వాస్తవంగా వాటిపై దృష్టి పెట్టలేదు. భవనాల నిర్మాణాన్ని కొంతవరకు తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టుకున్నారు. అంతే తప్ప.. లాబొరేటరీల ఏర్పాటు, అధ్యాపకుల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ఆయా మెడికల్ కాలేజీల వ్యవస్థ మొత్తం గందరగోళంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీల విషయంలో కుదిరిన ఒప్పందాలని రుద్దుచేసి, పరిస్థితిని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారు చేస్తారని ప్రజలకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ఇలాంటి బెదిరింపులు ఏమీ లేకుండానే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చిన అభివృద్ధి పనులు అన్నింటిని విధ్వంసకరమైన రీతిలో ఎక్కడివక్కడ నిలిపేసిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు చరిత్ర రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. అప్పుడు ఏ హెచ్చరికలు లేకుండానే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆయన.. ఇప్పుడు స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను తాను సీఎం కాగానే రద్దు చేస్తాను.. అంటున్నారంటే అది రాష్ట్ర సర్వనాశనానికి దారితీస్తుందని ప్రజలు భయపడుతున్నారు. జగన్ ఒప్పందాలను రద్దు చేయడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తిరిగి వెనక్కు తీసుకు వెళ్లడం అనేది కేవలం మెడికల్ కాలేజీ లతో ఆగదని రాష్ట్రాన్ని సమస్తంగా తిరిగి వినాశనం వైపు నడిపిస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జగన్ మాటలను గమనిస్తుంటే ఆయన మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ రకంగా తాను సీఎం కాగానే ఇప్పటి ఒప్పందాలను రద్దు చేస్తానంటున్న జగన్ మాటలు ఆయన పార్టీకి ఆత్మహత్యా సదృశ్యంగా మారుతున్నాయి.