జగన్ స్టైల్ : ఎంత పరువైనా పోనీ.. వదిలేదే లే!

కన్నతల్లికి కానుకగా ఇచ్చిన షేర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి మరింత పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల తనను మోసం చేసి షేర్ల బదిలీ చేసుకున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. వారికి జరిగిన షేర్ల బదిలీని రద్దుచేసి.. ఆ షేర్లను తనకు తిరిగి దక్కించాలంటూ.. ఆయన ట్రిబ్యునల్ లో దావా నడుపుతున్నారు. తన పేరిట ఉన్న షేర్లను తల్లి చెల్లి అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు.

సరస్వతి పవర్ షేర్ల విషయంలో ఇప్పటికే ట్రిబ్యునల్ లో దావా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలనీ.. సరస్వతి పవర్ లో 99.75 శాతం షేర్లు తనవేనని,, పూర్తిగా తనకు మాత్రమే హక్కు ఉన్నదని.. జగన్, భారతిలు కుట్రపూరితంగా షర్మిల పేరును కూడా తెరమీదకు తెస్తున్నారని.. విజయమ్మ ఇటీవల ట్రిబ్యునల్ ఎదుట కౌంటర్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే కనీసం తన సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని జగన్ ఇప్పుడు తన సరికొత్త పిటిషన్ లో ఆరోపిస్తున్నారు. కన్నతల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల లతో పాటు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ను ప్రతివాదులుగా జగన్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే ఈ విషయాన్ని పదేపదే కెలుక్కోవడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకుంటున్నారనేది పలువురు చెబుతున్న మాట. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో కుటుంబానికి సమకూరిన ఆస్తుల పంపకం విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య తగాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. చెల్లెలు తనకోసం ఎన్నికల ప్రచారంలో ఎంతగా పాటు పడినప్పటికీ.. రాజకీయంగా ఆమెకు ఒక స్థానం కల్పించడానికి మనసొప్పకుండా ఆమెను దూరం పెట్టి, తనకు అధికారం దక్కిన వెంటనే తగాదా షురూచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి! ఆస్తుల తగాదాలు ముదరడంతో.. చెల్లెలికి ఇవ్వాల్సిన వాటిని రకరకాల సాకులు చెప్పి అమ్మ విజయమ్మ పేరిట గిఫ్ట్ డీడ్ ద్వారా స్వయంగా రాసి ఇచ్చారు.

అయితే షర్మిల సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని, తర్వాత ఏపీ కాంగ్రెస్ సారథి అయి.. రాజకీయంగా తనకు చిక్కులు సృష్టించడం ప్రారంభించాక.. జగన్ ఆమెకు ఇచ్చిన ఆస్తులను టార్గెట్ చేశారు. తల్లికి గిఫ్ట్ డీడ్ ద్వారా షేర్లు బదిలీ చేయరాదని.. ఆ డీడ్  రద్దు చేసి తిరిగి తనకు ఇవ్వాలని ఆయన దావా నడుపుతున్నారు. కన్నతల్లికి కానుకగా ఇచ్చిన ఆస్తిని కూడా తిరిగి కావాలని కోరుకుంటున్న జగన్ బుద్ధి గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన కుత్సితపు బుద్ధిని ప్రజలు ఈసడించుకుంటున్నారు. మొత్తానికి ఈ షేర్ల వివాదంలో జగన్ కు అనుకూల తీర్పు వస్తుందో లేదో గానీ.. ఆయన పరువు మాత్రం పూర్తిగా పోతున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories