ఒక బడిలో టీచరు.. ఒక కర్రపుల్లను ఒక కుర్రవాడి చేతికి ఇచ్చి దాన్ని విరచమని చెప్పాడు. వాడు సునాయాసంగా దానిని తన చేతులతో రెండు ముక్కలుగా విరిచేశాడు. యింకో పుల్ల యిచ్చాడు.. దానిని కూడా విరిచేశాడు! ఆ తరువాత.. అయిదారు పుల్లలను ఒకటే కట్టగా దారంతో కట్టి.. దాన్ని విరచమని అదే కుర్రాడికి ఇచ్చాడు. వాడు పాపం శక్తివంచన లేకుండా చాలా ప్రయత్నించాడు గానీ.. విరచలేకపోయాడు. అప్పుడు చెప్పాడు టీచరు.. ‘కలసికట్టుగా ఐక్యంగా ఉండడంలోని బలం అది’ అనే సంగతి!
ఈ నీతిని పాఠం రూపంలో గానీ, కథ రూపంలో గానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిన్నతనంలో తెలుసుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ.. ఆయన అనుసరిస్తున్న దారి మాత్రం.. ఐక్యంగా ఉండాలనే ప్రాథమిక నీతికి విరుద్ధంగా ఉంది. నలుగురిదృష్టిలో దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీల అనైక్యతను ఒక లోపంగా ఎత్తిచూపించేలా ఉంది.
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్ల పరంగా అన్యాయం జరుగుతుందని, ప్రాధాన్యం తగ్గుతుందనే విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఈ విషయంపై ముందుగా మేలుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం ఏర్పాటుచేశారు. అదేమీ స్టాలిన్ సొంత కార్యక్రమం కాదు. దక్షిణాది అన్ని రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటదలచుకున్న భేటీ! కేరళ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు, కర్నాటక డిప్యూటీ ముఖ్యమంత్రి అంతా వచ్చారు. కానీ ఏపీనుంచి మాత్రం ప్రాతినిధ్యం లేదు. పాలకపక్షం ఎన్డీయేనే గనుక వారు వెళ్లరు. జగన్ సమావేశానికి వెళ్లకుండా, తన ప్రతినిధిని పంపకుండా.. వారు చెబుతున్న వాదనలనే లేఖలో వ్యక్తీకరిస్తూ ప్రధానికి పంపారు.
ఆలేఖలో ప్రత్యేకంగా.. ‘మీ వంటి నాయకుడి సారథ్యం ఈ దేశానికి చాలా అవసరం’ అంటూ మోడీని కీర్తించారు కూడా. ఈ లేఖ ప్రతిని మాత్రం స్టాలిన్ కు పంపారు తప్ప.. సమావేశానికి వెళ్లలేదు.
ఈ చర్య యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలు ఒకే వాదన వినిపిస్తున్నాయి గానీ.. అవన్నీ ఐక్యంగా లేవు అనే సంకేతాలను మోడీ సర్కారుకు పంపుతాయి కదా! అనైక్యంగా ఉన్న పార్టీల పోరాటానికి విలువ దక్కుతుందా? అనేది ప్రజల సందేహం. అందుకే.. జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం అనేది దక్షిణాది ఐక్యతకు గండిలాగా తయారైందని, ఈ విషయంలో ఆయన సంకుచితంగా వ్యవహరించారని అంతా అనుకుంటున్నారు. చెన్నైలో భేటీకి తాను వెళ్లడానికి జగన్ కు భయం ఉంటే.. కనీసం తమ పార్టీ ప్రతినిధిని పంపి ఉంటే కొంచెం గౌరవంగా ఉండేదని.. అందరూ ఒక్కతాటిమీద ఉన్నారనే సంకేతాలు కేంద్రానికి వెళ్లేవని అంతా అనుకుంటున్నారు. డీలిమిటేషన్ విషయంలో ఇప్పటికింకా సమయం మించిపోలేదు.. ముందుముందు అడుగులు వేయాల్సి వచ్చినప్పుడు అందరితో కలసినడవడం సత్ఫలితాలు ఇస్తుందని జగన్ తెలుసుకుంటే మంచిది.