మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ తీసుకోవడం, భార్య భారతితో సహా, ఇంకా అనేకమంది వందిమాగధ నాయకులను వెంటబెట్టుకుని గవర్నరును కలవబోతుండడం.. ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మకమైన తాజా కబురు. బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతానికి తన షెడ్యూలులో ఇదొక్కటే కార్యక్రమం పెట్టుకున్నారు. పార్టీలోని తన అనుంగు నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపిన జగన్మోహన్ రెడ్డి, మొత్తానికి గవర్నరును కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితులను గురించి గవర్నరుకు నివేదిస్తారని, శాంతి భద్రతల పరిరక్షణ గురించి గవర్నరుకు ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే.. జగన్ గవర్నరుతో భేటీ కావడం వెనుక అసలు కారణం వేరే ఉందని విశ్వసనీయ సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర గవర్నరుతో భేటీ అవుతున్న సమయానికి ఆయన వెంట ఉండేలా.. బలగం నిండుగా ఉండాలనే ఉద్దేశంతో.. రాష్ట్రంలోని కీలక వైసీపీ నాయకులు అందరినీ తాడేపల్లికి రావాల్సిందిగా ముందే పురమాయించారు. వారితో ఆయన భేటీ అయి.. గవర్నరుతో మాట్లాడాల్సిన అంశాల గురించి చర్చించారు. తాను ఏం చెప్పదలచుకుంటున్నారో వారికి వివరించారు. తద్వారా.. గవర్నరు వద్ద అవసరమైతే అందరూ ముక్తకంఠంతో రాష్ట్రప్రభుత్వంపై పితూరీలు చెప్పేలా వారిని బ్రీఫ్ చేశారు. ఈ కసరత్తు మొత్తం జరిగినప్పటికీ కూడా.. నిజానికి గవర్నరును కలవడం వెనుక జగన్ పర్సనల్ ఎజెండా ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
దాదాపుగా మూడున్నర వేలకోట్ల రూపాయలు స్వాహా చేసిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే మొత్తం 41 మంది నిందితులు ఉన్నారు. వారిలో 13 మందిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా కూడా ప్రస్తుతం రిమాండులో జైల్లో నే గడుపుతున్నారు. కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వారు మాత్రమే కాదు.. జగన్ కు అత్యంత ఆత్మీయులు అయిన అధికారులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయనకు అత్యంత విశ్వసనీయులైన నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా జైల్లోనే ఉన్నారు. అలాగే వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు సమస్తం పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ కూడా జైల్లోనే ఉన్నారు. కాగా, మరో 12 మంది నిందితులను అరెస్టు చేయడానికి నాన్ బెయిలబుల్ వారంట్లు కావాలని సిట్ కోర్టులో పిటిషన్ వేసి ఉంది. ఈనేపథ్యంలోనే జగన్ గవర్నరును కలవబోతున్నారు.,
ఆయన ప్రధాన విజ్ఞప్తి.. లిక్కర్ స్కామ్ అరెస్టులు తనదాకా రాకుండా చూడాలని గవర్నరును కోరడమే అని తెలుస్తోంది. మూడున్నర వేల కోట్లలో 90 శాతం దిగమింగిన అంతిమలబ్ధిదారు, బిగ్ బాస్ ఎవరనే విషయంలో ఇప్పటిదాకా బయటకు వస్తున్న లీకులు అన్నీ ఏం చెబుతున్నాయో జగన్ కు కూడా తెలుసు. ఇప్పటికే ప్రిలిమనరీ చార్జిషీటు పలుచోట్ల జగన్ పేరును ప్రస్తావించింది. మలి విడత చార్జిషీటు దాఖలైతే తన పేరు ఏ స్థానానికి వస్తుందనే విషయంలో జగన్ కు అనేక భయాలు ఇప్పటికే పుట్టి ఉండవచ్చు. అంతిమలబ్ధి జగన్ కే అందినట్టుగా సిట్ అనేక ఆధారాలు సేకరించినట్టుగా కూడా పుకార్లున్నాయి. ఈ నేపథ్యంలో తన అరెస్టు జరగకుండా చూడాలని విన్నవించడమే.. అబ్దుల్ నజీర్ ను కలవడంలో జగన్ అసలు ఆంతర్యం, లక్ష్యం అని పలువురు భావిస్తున్నారు.