సూది మొన దూర్చగలిగినంత సందు దొరికితే.. గునపం దూర్చేసే తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి అపారంగా ఉన్నాయి. ఆ బుద్ధులను ఆయన ఎన్నికల ప్రచార పర్వంలో చాలా పుష్కలంగా చూపించారు. వీసమెత్తు సందు దొరికితే చాలు.. దానికి చిలవలు పలవలుగా వంద అబద్ధాలను అల్లి.. చంద్రబాబు నాయుడును, కూటమి ఐక్యతను బదనాం చేయడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎన్డీఏ కూటమిలో లుకలుకలు పుట్టాయని.. చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేయడం ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టం లేదని.. తెలుగుదేశం, జనసేన ఒకవైపు భారతీయ జనతా పార్టీ మరొకవైపు.. కూటమిలో ఎవరికి వారే అన్నట్లుగా తయారయ్యారని రకరకాల తప్పుడు ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోయారు.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం రెండు రోజుల పర్యటన నిర్వహించిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి పాపం ఎంతో కష్టపడి చాలా రోజులుగా సాగిస్తూ వచ్చిన ఈ దుష్ప్రచారం యావత్తు దూదిపింజలాగా గాలికి తేలిపోయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో కలిసి వేదికను పంచుకోవడం మాత్రమే కాకుండా.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మోడీ వైఖరిని ప్రజలందరూ గమనించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని మోడీ చెప్పిన మాటలను వారు అర్థం చేసుకున్నారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రజలను దోచుకుంటున్నదో ఆటలన్నీ కట్టించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిత్యంతో పని చేస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా నొక్కి వక్కాణించారు. ఈ ప్రకటనల నేపథ్యంలో.. కూటమి పార్టీల ఐక్యత గురించి జగన్మోహన్ రెడ్డి సాగించిన అబద్ధపు ప్రచారం ఇప్పుడు ప్రజల ఛీత్కారాలకు గురవుతోంది.
కూటమి ఐక్యతకు ఏ రకంగా గండి కొట్టాలా అని .. గోతి కాడ నక్కలాగా జగన్ ఎదురు చూస్తూనే వచ్చారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు మాత్రమే కలిసి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి బొమ్మలతో మాత్రమే విడుదల చేసినప్పుడు.. వైయస్ జగన్ కు లడ్డు లాంటి అవకాశం దొరికింది. చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలకు కేంద్రంలోని మోడీ సర్కారు పూచీ ఉండడం లేదని.. అందుకే మ్యానిఫెస్టో మీద తన బొమ్మ ప్రచురించవద్దంటూ మోడీ- చంద్రబాబు నాయుడు ను హెచ్చరించారని ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్ ఎన్నికల సభలలో చెబుతూ వచ్చారు.
ఒకవైపు భారతీయ జనతా పార్టీ తమ పార్టీ మేనిఫెస్టో విడిగా జాతీయ స్థాయిలో ఉంటుందని.. ఏ రాష్ట్రంలో కూడా అక్కడి ప్రాంతీయ పార్టీల మిత్రపక్షాలు విడుదల చేసిన మేనిఫెస్టోలలో మోడీ బొమ్మ లేకుండానే వచ్చాయని ఎంతగా వివరించే ప్రయత్నం చేసినప్పటికీ.. జగన్ సాగించిన దుష్ప్రచారం మాత్రం యధేచ్ఛగా సాగిపోయింది. గోబెల్స్ లాగా ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతూనే ఉండడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కొంతమంది అమాయక ప్రజలను ఆ మేరకు నమ్మించగలిగారు కూడా.
కానీ నరేంద్ర మోడీ రాష్ట్రంలో రెండు రోజులపాటు సుడిగాలిలా పర్యటించి ప్రచార సభలు నిర్వహించిన తర్వాత ప్రజల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. జగన్ ఇన్నాళ్లుగా ఎంత దారుణమైన అబద్ధాలు చెప్పారో వారికి అర్థమయింది. ప్రతిపక్ష కూటమిని ఎదుర్కొనే దమ్ము లేక వారి ఐక్యత గురించి ప్రచారం చేసిన అబద్ధాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇలాంటి కుట్రలకు పోలింగ్ రోజున వారు ఎలా బుద్ధి చెబుతారో చూడాలి.