గన్మోహన్ రెడ్డి తన రాజకీయ పార్టీని మోనార్క్ లాగా నడుపుతారనే సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను తప్ప వేరే దిక్కు లేదు, ఉండరాదు అన్నట్టుగా.. తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చేయించుకుని.. అతిశయం ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి! ఆ తర్వాత అలాంటివి చెల్లవంటూ ఎన్నికల సంఘం అక్షింతలు వేసిన తర్వాత వెనక్కి తగ్గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తనకు ఎవ్వరు ఏం సలహా చెప్పినా వినరు అని, తన ఇష్టారాజ్యంగానే పనులు చేస్తుంటారని పార్టీలోని వారు చెబుతుంటారు. అలాంటిది.. జగన్ లోని లోపాలను ఆయనకు స్వయంగా చెప్పేంతటి వాళ్లుంటారా? ఈ మాట ప్రజలు నమ్మరు గానీ.. జగన్ మాత్రం.. తన లోపాలను తన వాళ్లు చెప్పారని అంటున్నారు.
2024 ఎన్నికల సమరం సాగుతున్న రోజుల్లో ఆయన అనుచరులు వచ్చి.. అన్నా నీతో ఒక సమస్య ఉంది అని చెప్పారట. ఇంతకూ ఏమిటయ్యా ఆ సమస్య అని అడిగితే.. ‘నీలో అతి మంచితనం, అతి నిజాయితీ ఉన్నాయి’ అన్నారట. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మురిసిపోతూ.. కృష్ణాజిల్లా పార్టీ వారితో నిర్వహించిన సమావేశంలో స్వయంగా వెల్లడించుకున్నారు. తనలో అతి నిజాయితీ, అతి మంచితనం ఉన్నాయని ఆయన సొంతడబ్బా కొట్టుకున్నారు. ఆ సమస్య వల్లనే తాము కష్టాలు పడుతున్నామని తమ్ముళ్లు జగనన్నకు నివేదించుకున్నారట. ఓడిపోయిన తర్వాత కూడా ఆ అతినిజాయితీ వల్లనే ఓడిపోయినట్టుగా చెప్పుకొచ్చారట. కానీ.. వేదాంతి మరియు ఫిలాసఫర్ అయిన జగనన్న.. ‘ఆ అతి నిజాయితీ అతి మంచితనమే మనల్ని మళ్లీ ఏదో ఒకనాటికి అధికారంలోకి తీసుకువస్తాయి’ అని వారిని ఊరడించారట. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా ఆ మీటింగులోనే చెప్పుకున్నారు.
జగన్మోహన్ రెడ్డిలో అతినిజాయితీ అంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా చిత్రంగా నవ్వుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి, తప్పుడు లావాదేవీల కేసుల్లో జగన్ ఇప్పటికీ నిందితుడే. ఆయన కేవలం బెయిలు మీద ఉన్న ఆర్థిక నేరస్తుడు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో పాల్పడిన అవినీతి బాగోతాలు చీమలపుట్టలు పగిలినట్టుగా ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. సెకితో ఒప్పందాలు చేసుకోవడానికి దేశంలో అయిదు రాష్ట్రాలకు కలిపి అదానీ గ్రూపు 2049 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టుగా అమెరికాలోని ఎఫ్‌బిఐ సంస్థ తమ దర్యాప్తులో తేలిస్తే.. అందులో కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి చెల్లించిన వాటానే 1750 కోట్లు అనే సంగతిని ఆయన మరచిపోతున్నట్టున్నారు. ప్రజలకు ఇవన్నీ తెలియదని అనుకుంటున్నారో ఏమో గానీ.. తన అతి నిజాయితీ గురించి డప్పుకొట్టుకుంటున్నారు.