నిబంధనలకు విరుద్ధంగా.. ఆంక్షలను ధిక్కరించి, వ్యవస్థలను అతిక్రమించి నడుచుకోవడమే తన ముద్రగల రాజకీయం అని నమ్మే వ్యక్తి జగన్. అందుకే పోలీసులు కాన్వాయ్ తో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ.. ధిక్కరించి 89 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే మళ్లీ నెల్లూరు యాత్ర అంటూ మరొక హడావిడి చేస్తున్నారు. అయితే నెల్లూరు లో కూడా అలాంటి అతిచేస్తే కుదరదని, ఆయన పర్యటనలో చీమకు హాని జరిగినా ఊరుకునేది లేదని సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. జగన్ దళాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విని తీరవలసిన హెచ్చరిక ఇది.
వైఎస్ జగన్ నెల్లూరు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. తన పాలన కాలంలో విచ్చలవిడి దందాలు చేసిన అనుచరుడు.. తనలాగానే పోలీసులను బట్టలు విప్పదీయించి కొడతామని హెచ్చరించిన ఘనుడు కాకాని చక్రపాణి ని పరామర్శించడం ఆయన లక్ష్యం. కానీ ఈ పర్యటనలో వీలైనంత రచ్చ చేయడానికి ఆల్రెడీ కుట్రలు మొదలిపోయినట్టుగా తెలుస్తోంది.
జగన్ పర్యటనకోసం 50 వేల మంది జనాన్ని సమీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారని సోమిరెడ్డి వెల్లడించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం ఈ టార్గెట్ కోసం పార్టీ నేత తలశిల రఘురామ్ నెల్లూరు లోనే తిష్ట వేసి.. స్థానిక నాయకులను jana సమీకరణకు ఒత్తిడి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
జగన్ దళాలు ఆల్రెడీ రోప్ పార్టీ కావాలని, హెలికాప్టర్ అనుమతి కావాలని కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. రోప్ పార్టీ రాదనే సంగతి వారికి కూడా తెలుసు. రాకపోవడమే వారి కోరిక కూడా. భారీగా జనాన్ని పోగేసి అల్లర్లు చేయించి, నెపం పోలీసుల మీదికి భద్రతలోపం మీదికి నెట్టేసే కుట్రతోనే వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నట్టు కనిపిస్తోంది. వారి కుట్రలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.