మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన సూత్రధారి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండులో గడుపుతున్నారు. తాజాగా ఆయనతో అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇద్దరూ ములాఖత్ లో సమావేశం అయ్యారు. పరామర్శించారు. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత.. విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద అనేక విమర్శలు కురిపించారు. అసలు లిక్కర్ కుంభకోణం అనేదే కట్టుకథ అని, కేవలం రాజకీయ కక్షతో పగతీర్చుకోవడానికి అరెస్టులు చేస్తున్నారని రకరకాల నిందలు వేశారు. అవన్నీ మామూలే. కానీ ఈ ఇద్దరు నాయకులు మిథున్ రెడ్డి పరామర్శకు ములాఖత్ కు వెళ్లడం వెనుక ఏదో మతలబు ఉన్నదనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి.
‘ఏముంది.. ములాఖత్ చాలా సాధారణం కదా. అందుకు మిథున్ రెడ్డికి కోర్టు అనుమతి ఉంది కదా.. ఎవ్వరైనా వెళ్లి కలవొచ్చు కదా..’ అని ఎవరికైనా అనిపించవచ్చు. అంతవరకు నిజమే. కానీ ఈ ఇద్దరు నాయకులు ఈ సమయంలో మిథున్ రెడ్డి వద్దకు వెళ్లడం మాత్రం సందేహాస్పదమే.
ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులైన పార్టీ నాయకుల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందు వరుసలోనే ఉంటారు. పార్టీ నిర్వహణ గానీ, ఎన్నికల నిర్వహణ గానీ, పార్టీ తరఫున తెరవెనుక వ్యవహారాలు నడపడం గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడి హోదాలో, ఢిల్లీలో కేంద్రంలోని పెద్దలతో, జగన్ కు అవసరమయ్యే లాబీయింగ్ చేయడానికి అన్నింటికీ కీలకంగా వ్యవహరించే వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అలాంటి మిథున్ రెడ్డి అరెస్టు అయి ఇప్పటికి చాలా వారాలు గడుస్తున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి ములాఖత్ కోసం వెళ్లలేదు, ఆయనను కలవలేదు.
తమ పార్టీ నాయకులు అరెస్టు అయిన వెంటనే.. ఆదిమూలపు సురేష్ దగ్గరినుంచి, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్దనరెడ్డి అందరినీ జైళ్లకు వెళ్లి ములాఖత్ లో పరామర్శిస్తున్న జగన్, మిథున్ రెడ్డి వద్దకు మాత్రం వెళ్లకపోవడం ఆశ్చర్యకరమే. అయితే.. మిథున్ అరెస్టు అయినది లిక్కరు కుంభకోణం కావడం.. ఆ కేసులో అందరి చూపులు అంతిమలబ్ధిదారుగా తన మీదనే ఉండడం వల్ల.. జగన్ ములాఖత్ కు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం. అయితే.. జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి చేరవేయవలసిన ముఖ్యమైన సందేశాల కోసం జగన్ అనంత వెంకట్రామిరెడ్డిని, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని వాడుకున్నట్టుగా కొందరు అనుమానిస్తున్నారు.
సీక్రెట్ సమాచారాలను ములాఖత్ లకు వెళ్లే మిథున్ కుటుంబ సభ్యులకంటె వీరిద్వారా చేరవేయడం సేఫ్ అని జగన్ భావించినట్టు తెలుస్తోంది. ఇవాళ్టి రోజుల్లో ఎవ్వరితోనూ ఫోన్లలో కూడా సీక్రెట్లు మాట్లాడే పరిస్థితి లేదని భయపడుతున్నట్టు తెలుస్తోంది. 14వ తేదీన కడప జిల్లా జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున జగన్ ధర్మవరంలో శుభకార్యానికి హాజరయ్యారు. ఆ రోజున ఈ నాయకులు జగన్ ను కలిశారు. తాను మిథున్ కు చేరవేయదలచుకున్న రహస్యాల్ని ఈ ఇద్దరికీ చెప్పి.. జగన్ వారిని ములాఖత్ కు పంపినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. మరి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి, లిక్కర్ కుంభకోణంలో తన పాత్రను బయటపెట్టేస్తారేమో అని జగన్ భయపడుతున్నారేమో తెలియదు. మొత్తానికి ఈ ములాఖత్ ల రూపంలో ఏదో జరుగుతున్నదని పలువురు సందేహిస్తున్నారు.