సొంత వ్యవహారాలు తప్ప జగన్ కు మరొకటి పట్టడం లేదు. లేదా, సొంత వ్యవహారాలు చూసుకోవడానికే ఆయనకు సమయం చాలడం లేదు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఆయన పాపం కారణంగా బుడమేరు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో ప్రజల ఎదుటకు వచ్చి ఏదో.. కాస్త ప్రభుత్వం మీద నిందలు వేస్తూ అభాసు పాలు కావడం తప్ప జగన్ ఇప్పటిదాకా ప్రజల గురించి పట్టించుకున్నది లేదు. తన సొంత వ్యవహారాల గురించి మాత్రం కోర్టులో కేసుల మీద కేసులు వేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే మరో ప్రహసనం కూడా చోటు చేసుకుంది.
అప్పట్లో మంత్రి నారాయణ మీద సాక్షి దినపత్రికలో పిచ్చి రాతలు రాసినందుకు జగన్ మీద పరువునష్టంకేసు దాఖలు అయింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆకేసు నడుస్తోంది. న్యాయస్థానం ఎన్నిసార్లు నోటీసులు పంపినా.. జగన్ కనీసం వాటికి స్పందించలేదు. సహజంగానే వ్యవస్థల పట్ల గౌరవం ఉండని జగన్.. నోటీసులను పట్టించుకోకుండా ఉండిపోయారు. ఆ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కావడంతో ఇంకా రెచ్చిపోయారు. నిర్లక్ష్యం పెరిగింది. ఎన్నికల నామినేషన్ సమయంలో అఫిడవిట్లో ఆ కేసును పేర్కొనడం తప్ప.. దాన్ని ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు.
తీరా ఇటీవల యూకే టూర్ వెళ్లాలనుకుంటే.. ఆ కేసే ఆయన కాళ్లకు బంధంలాగా చుట్టుకుంది. పాస్ పోర్టు రెన్యువల్ కు ఆ కోర్టు కేవలం ఏడాదికే అనుమతించింది. కోర్టుకు వచ్చి పూచీకత్తు సమర్పించాలని షరతులు పెట్టింది. ఆ కోర్టు పట్ల చులకన భావం ఉన్న జగన్ తన స్థాయికి హైకోర్టే ఉండాలనుకున్నారు. హైకోర్టుకు వెళ్లారు. అయినా సరే.. ఆ షరతుల విషయంలో తామేం చేయలేమని తీర్పు చెప్పారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ఆ కేసు ఉన్నట్టు తనకు తెలియనే తెలియదని బుకాయించిన జగన్ భంగపడ్డారు కూడా.
చివరికి ఆ కేసు తనను చికాకు పెడుతూనే ఉంటందని జగన్ కు అర్థమైనట్టుంది. అందుకే ఏకంగా ఆ కేసును కొట్టేయాలని హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. అసలు ఒక్క వాయిదాకు కూడా హాజరు కాకుండానే.. కేసు కొట్టేయాలని పై కోర్టులో దావా వేయడం జగన్ కు మాత్రమే చెల్లింది. ఓడిపోయిన తర్వాత.. తనకు ప్రతిపక్ష హోదాకావాలని, సెక్యూరిటీ పెంచాలని, తన మీద కేసులు కొట్టేయాలని ఇలా.. తన గొడవ గురించి మాత్రము జగన్ దావాలు వేస్తున్నారు. ఆయనకు ప్రజల సమస్యలు పట్టించుకునే ఖాళీ లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.