మూడు పేరుతో జగన్ వంచనాత్మక మాటలు!

మూడు రాజధానులు అనే మాట వెనుక జగన్మోహన్ రెడ్డి దార్శనిక దృక్పథం ఇసుమంతైనా లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కోరుకున్నదెల్లా.. అమరావతిని స్మశానంగా మార్చేయడం మాత్రమే. అందుకే తొలుత అక్కడి ప్రజావేదికను విధ్వంసం చేయడంతోనే తన పాలన ప్రారంభించారు. అమరావతి పురోగతికి పూర్తిగా సమాధి కట్టేస్తూ.. మూడు రాజధానుల పాట ప్రారంభించారు. ఆ వివాదం కాస్తా కోర్టుకు వెళ్లింది. అలా చేయడానికి వీల్లేదని, అమరావతి ఒక్కటి మాత్రమే రాజధానిగా ఉండాలని, ఆగిన నిర్మాణాలన్నీ తిరిగి వెంటనే ప్రారంభించాలని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది. అయినా సరే అవేమీ అస్సలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు కర్నూలు నేలమీద అడుగు పెట్టేసరికి.. మూడు రాజధానులు ఏర్పాటుచేసేశానని బొంకుతున్నారు.

కర్నూలు అనే పేరుమీద న్యాయరాజధాని అనే ఒక పడికట్టు మాట ఉపయోగించారు గనుక.. తాను అక్కడ ఆ మాట వాడితే ప్రజలు బుట్టలో పడుతారని జగన్ అనుకున్నట్లుగా ఉంది. కానీ.. జగన్ మూడు రాజధానులు అనే మాయ వలన అత్యధికంగా మోసపోయింది కర్నూలు ప్రజలే. విశాఖకు అంతో ఇంతో మేలు జరిగింది. కనీసం రియల్ ఎస్టేట్ పుంజుకుంది. మోసాలూ కబ్జాలు పెరగడం బైప్రోడక్ట్ అయింది. అయితే హైకోర్టు ఏం చెప్పింది? ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే పేరుమీద ఆఫీసులను విశాఖకు తరలించడానికి వీల్లేదని హైకోర్టు  చెప్పింది. ఒకవేళ జగన్ కు మూడు రాజధానులు అనే కాన్సెప్టు మీద చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. కర్నూలులో న్యాయరాజధాని అనేమాటను ఏం చేశారు? అక్కడ చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టు బెంచ్ అని జగన్ అన్నారు. చీఫ్ జస్టిస్ తర్వాత.. ముందు హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయానికి ఒక్క భవనానికి, షెడ్డుకైనా ఆయన పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? అనేది కర్నూలు జిల్లా ప్రజల్లో మెదలుతున్న సందేహం. ఏమీ చేయకుండానే.. మూడు రాజధానులు తెచ్చేశా అని బొంకడం అచ్చంగా ప్రజల్ని మోసం చేయడమే.

జగన్ జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. విశాఖ వాసులను కూడా ఇదేవిధంగా మోసం చేశారు. రెండు సంవత్సరాలకు పైబడి వచ్చే నెలలో నేను ఇక్కడకు వచ్చేస్తున్నా, కాపురం విశాఖలోనే పెట్టేస్తున్నా, విశాఖ కేంద్రంగా క్యాంపు కార్యాలయాలు ఉంటాయి.. లాంటి కల్లబొల్లి మాటలతో వారితో ఆటాడుకుంటున్నారు. మూడు రాజధానులు అనే జగన్ మాటల వలన.. అమరావతి స్మశానంగా మారిపోయిన మాట నిజమే. కానీ, అంతకంటె ఎక్కువగా విశాఖ, కర్నూలు ప్రజలు మోసానికి గురయ్యారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories