జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ప్రత్యేకించి ఫైబర్ నెట్ విభాగంలో ప్రెవేటు ఏజన్సీకి ఇచ్చిన కాంట్రాక్టు ద్వారా జరిగిన నియామకాల గురించి కథలుకథలుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు- నియామకాలు అంటే ఒక నిర్దిష్టమైన పద్ధతీపాడూ ఏమీ లేకుండానే వందల మందిని అపాయింట్ చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోను చేసి చెబితే చాలు.. వారి సిఫారసు పొందిన వారికి ఉద్యోగం కట్టబెట్టేయడం అనేది ఒక ఆనవాయితీగా అప్పట్లో చెలామణీ అయింది. అడ్డదారుల్లోనే వారంతా ప్రభుత్వ కొలువుల్లోకి వచ్చేశారు. ఒక దశలో పరిస్థితి ఎలా తయారైందంటే.. నెలవారీ అందరికీ జీతాలు మాత్రం వెళ్లిపోతుంటాయి. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో.. ఏం పనిచేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇలా కొలువుల దందాలు నడిచాయి. ప్రెవేటు ఏజన్సీతో ఒప్పందం రూపంలో జరిగిన ఈ అపరిమితమైన దందాకు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అధికారిక నియామక పత్రాలు లేని 417 మందిని తొలివిడతలోనే తొలగించారు. రెండో విడతలో మరో 200 మందిమీద చర్యలు తీసుకున్నారు. తాజాగా ఫైబర్ నెట్ లో దాదాపు 500 మందిని ప్రభుత్వం తొలగించింది. ఈ ఉద్యోగులను అందించే సూర్య ఎంటర్‌ప్రైజెస్ ఏజన్సీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో ఇంతటితో ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటూ వారంముందే నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధుల్లో మిగిలిన ఈ 500 మంది కొలువులకు ఈ నెలాఖరుతో భరతవాక్యం పలికినట్టే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో అనేక వ్యవహారాల్లో చూపించిన విచ్చలవిడితనంలాగానే.. ఉద్యోగాలు- నియామకాల్లో కూడా అదే ధోరణి అవలంబించారు. ఎవరు ఏం పనిచేస్తున్నారో తెలియకుండానే.. ఫైబర్ నెట్ లో కొలువులు పంచేశారు. అయితే.. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో పిచ్చి, అసభ్య పోస్టులు పెడుతూ.. రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లే సమూహాలు అందరికీ కూడా.. ఈ ఫైబర్ నెట్ కొలువుల పేరుతో ప్రతినెలా వేతనాలు దోచిపెట్టినట్టుగా ఆరోపణలున్నాయి. తమ పార్టీ సేవకు, తమ భజనకు వాడుకుంటున్న వారందరికీ ప్రభుత్వ ఖజానానుంచి సొమ్ము దోచిపెట్టడానికి.. వైసీపీ ఈ ఫైబర్ నెట్ విభాగాన్ని ఒక గొప్ప మార్గంగా వాడుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు ఏడాది కాలం తర్వాత ఈ అక్రమ దందాకు చరమగీతం పలికారు.