ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో క్యాబినెట్ భేటీ ముగిసింది. అనేక కీలక వ్యవహారాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత నిర్మాణాలకు ఆమోదించిన టెండర్ దారులకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ బేటి ఆమోదం తెలియజేసింది. 617 కోట్ల రూపాయలతో అసెంబ్లీ నిర్మాణాన్ని, అలాగే 786 కోట్ల రూపాయలతో హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇంకా ఎస్సీ వర్గాకరణ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. అలాగే గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రికి ఉచితంగా స్థలం కేటాయించాలని, కుప్పంలో సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ భేటీలో తీసుకున్న మరో నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉండే మత్స్యకార కుటుంబాలలో తిరుగులేని రీతిలో వెలుగు నింపేదిగా ఉందని హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
అదేంటంటే.. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సీజన్లలో వేటకు వెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధిస్తూ ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. చేపల వేట నిషేధించిన కాలంలో మత్స్యకారకుటుంబాలకు ప్రభుత్వమే ఎక్స్ గ్రేషియా అందిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలోనే ఇలాంటి మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియాను పెంచుతామని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకుంటూ వారికి నెలకు 20 వేల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. దీనివలన వేలాది మత్స్యకార కుటుంబాలలో నిశ్చింత ఏర్పడుతుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలకు ఇచ్చే మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచారు. ఆ మాత్రం పెంచినందుకు మత్స్యకార జీవితాలను సముద్ధరిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి సొంత డప్పు కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఇచ్చే మొత్తాన్ని జగన్ ఇచ్చే దానికంటే ఒకేసారి రెట్టింపు చేసి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం పట్ల మత్స్యకార కుటుంబాలలో ఆనందం వెల్లివిరుస్తోంది.
తాము పక్కన పెట్టిన అమరావతిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెడుతుండడాన్ని చూసి ఓర్వలేక పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. రాజధాని కోసం పనిచేయడం తప్ప సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలను కూడా ఒక్కటొక్కటిగా కార్యరూపంలోకి తెస్తున్న ఏపీ ప్రభుత్వం సమాంతరంగా తమ మేనిఫెస్టోలో మిగిలిన అన్ని హామీలను కూడా అమల్లో పెడుతూ వస్తోంది. మత్స్యకారులకు 20వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడమే ఇందుకు గొప్ప ఉదాహరణ అని ప్రజలు నమ్ముతున్నారు.