అదేమిటి? సోమవారమే కదా పోలింగ్ పూర్తయింది! ఖచ్చితంగా ఎంత శాతం ఓట్లు పోలయ్యాయనే లెక్క కూడా ఇంకా పూర్తిగా తేలలేదు కదా.. అంతలో జగన్ తలరాత ఎలా తేలుతుంది? ఆ విషయం తేలడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉన్నది కదా.. జూన్ 4న కదా ఫలితాలు వెల్లడవుతాయి! అని మీకు ఆశ్చర్యం కలుగుతుండవచ్చు. మామూలు నాయకులకు అయితే.. అధికారం దక్కడమూ- దక్కకపోవడమూ మాత్రమే తలరాత అవుతుంది గానీ.. జగన్మోహన్ రెడ్డి వంటి బెయిలుమీద బయట ఉన్న నాయకుడి పరిస్థితి వేరు. సుమారు రెండునెలలపాటూ విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ఎండనకా వాననకా ప్రచారం నిర్వహించి అలసిపోయిన జగన్మోహన్ రెడ్డి.. పోలింగ్ పర్వం ముగిసిన వెంటనే.. చల్లటి విదేశాలకు వెళ్లి సేదతీరాలని అనుకున్నారు. కానీ.. బెయిల్ మీద ఉన్న నిందితుడు కావడం మూలాన, విదేశీయాత్ర చేయాలంటే ఆయనకు సీబీఐ కోర్టు అనుమతి కావాల్సిందే. మరి ఆయనకు అనుమతి దక్కుతుందా? లేదా? అనేది ఇవాళ (మంగళవారం) తేలనుంది.
జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీనుంచి జూన్ 1 వరకు కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. లండన్ లో చదువుతున్న కూతుళ్లతో గడపడం సహా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలు పర్యటించి రావాలని అనుకున్నారు. ఆ మేరకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కోర్టు, సీబీఐ వారి అభ్యంతరాలను కోరింది. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమార్జనల కేసుల విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ దశలో ఆయనను విదేశీయాత్రకు అనుమతించడానికి వీల్లేదని, దానివల్ల ఇబ్బందులు వస్తాయని సీబీఐ- కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్నటువంటి న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఆ వాయిదా మంగళవారం ఉంది. ఇవాళ తీర్పు వెలువడుతుంది.
సీబీఐ అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో.. వారు నో చెప్పడమే.. జగన్ ఓటమికి ఒక సంకేతం అని పలువురు భావించారు. జగన్ ఓడిపోయే అవకాశం ఉన్నది గనుక.. ఫలితాలకు ముందుగా ఆయన విదేశాలకు వెళ్లడాన్ని అనుమతిస్తే, మళ్లీ తిరిగి వస్తారో లేదో అనే భయం సీబీఐలో ఉండవచ్చునని కూడా పలువురు అనుకుంటున్నారు. మరి కోర్టు ఈ వ్యవహారాలను ఎలా పరిగణిస్తుందో..? జగన్ విదేశాలకు విహారయాత్రకు వెళ్లడానికి అనుమతి ఇస్తుందో లేదో? ఓటు వేయడానికి ఎటూ లండన్ నుంచి కూతుళ్లు కూడా ఇండియా వచ్చారు గనుక.. ఇప్పటికిప్పుడు వెళ్లకపోయినా పర్లేదులెమ్మని చెబుతుందో వేచిచూడాలి.