వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గుడ్ బుక్ పేరితో ఒక కొత్త పాట ఎత్తుకున్నారు. కార్యకర్తల్లో పార్టీకోసం కష్టపడి పనిచేసే వారి పేర్లను గుడ్ బుక్ లో రాసి గుర్తు పెట్టుకుంటామని… పార్టీ మళ్లీ గెలిచిన తర్వాత.. వారికి పదవులు ఇవ్వడంలో తగిన ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. గుడ్ బుక్ లో తమ పేరు ఉంటే చాలు.. ఇక తమ జీవితం సెటిలైపోయినట్టే అని కేడర్ భ్రమపడే వాతావరణం కలిగిస్తున్నారు. అయితే. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని గమనిస్తున్నప్పుడు.. జగన్ మాటలను కేడర్ అంతగా నమ్మడం లేదని అర్థమవుతోంది. ఇవన్నీ కూడా జగన్ అవకాశవాద వైఖరికి నిదర్శనాలుగానే వైసీపీ కార్యకర్తలు గమనిస్తున్నారు.
అయిదేళ్లు పాటు సాగిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. ఆ పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. తమ రాజకీయ ప్రత్యర్థులను విపరీతంగా వేధించారు. ఎక్కడికక్కడ చిల్లర దందాలు, దళారీ పనులతో దోచుకున్నారు. వారి విచ్చలవిడితనాన్ని పట్టించుకోకుండా వదిలేసిన జగన్ సర్కారు.. వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం జరగలేదు. వారు తప్పులు చేసినప్పుడు పట్టించుకోకుండా వదిలేశారు గానీ.. కేడర్ ప్రజలతో మమేకం అయ్యేలా, ప్రజల్లో మర్యాద సంపాదించుకునేలా పార్టీని బలోపేతం చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి.. వాళ్లు మాత్రమే తనకు కళ్లూ ముక్కూ చెవులూ అన్నట్టుగా వ్యవహరించారు.
వాలంటీర్లనే తప్ప కేడర్ ను పట్టించుకోలేదు. వాలంటీర్లే విజయసారథులుగా అభివర్ణించారు. వారితో పదేపదే ఎన్నికల సమావేశాలు నిర్వహించారు తప్ప.. కార్యకర్తలను నామ్ కే వాస్తే అన్నట్టుగా వాడుకున్నారు. ఈ పరిణామాలన్నీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. ఏదైతేనేం పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను దువ్వే ప్రయత్నం చేస్తున్నారని కేడర్ అంటున్నారు. కార్యకర్తలకు అపరిమితమైన ప్రాధాన్యం ఇవ్వడం.. అనుచితంగా నెత్తిన పెట్టుకోవడం వల్లనే పార్టీ ఓడిపోయినట్టుగా ఇవాళ అందరూ భావిస్తెున్నారు.
పార్టీలో అంతర్గతంగా చర్చల్లో కూడా జగన్ కు సీనియర్లు ఇదే విషయం సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ బుక్ ముసుగులో కేడర్ మీద చూపిస్తున్న ప్రేమ నిజమైనదేనా.. లేదా అవకాశవాదంతో కూడినదా? అనే అనుమానాలున్నాయి. గతిలేదు కాబట్టి కేడర్ మీద ప్రేమ కురిపిస్తున్నారని, ఒక్కరొక్కరుగా పార్టీని వీడిపోతున్న తరుణంలో గుడ్ బుక్ వంటి మాయమాటలతోనమ్మించాలని చూస్తెున్నారని.. ఆ బుట్టలో పడితే, అవసరం తీరిన తర్వాత మళ్లీ పక్కన పెట్టేస్తారని కార్యకర్తలు భయపడుతున్నారు.