ముస్లిం ఓట్లు పడకుండా జగన్ దళం కుట్రలు!

చంద్రబాబునాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకోగానే.. ఒక రకంగా చెప్పాలంటే జగన్ దళం పండగ చేసుకుంది. బిజెపితో పొత్తువలన రాష్ట్రంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్లు తెలుగుదేశానికి, ఎన్డీయే కూటమికి ఒక్కటి కూడా పడవు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆ ఓట్లను జాగ్రత్తగా మభ్యపెట్టి తమకు అనుకూలంగా మలచుకోగలిగితే.. గెలిచిపోతాం అని సంబరపడ్డారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వారు అనుకున్నట్టుగా లేదు. ముస్లింలలో చంద్రబాబు పట్ల గానీ, కూటమి పట్ల గానీ వ్యతిరేకత ఏమీ వారికి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న వివిధ పరిణామాలను భూతద్దంలో చూపించి ప్రచారం చేస్తూ.. ముస్లిం ఓటు తెలుగుదేశానికి పడకుండా కొత్త కుట్రలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు అపరిమితంగా కష్టపడుతున్నాయి.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారింలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవు అనే వాదనను ప్రచారంలోకి తేవడానికి వైసీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు లేవు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అనే హామీ ఇచ్చే స్థితిలో కూడా వారు లేరు. కానీ.. భారతీయ జనతా పార్టీ మీద ముస్లిముల్లో ఒక ద్వేషం పుట్టించాలనేది వారి కోరిక. బిజెపి మీద కనీసం ముస్లిం వర్గాలు అసహ్యించుకునేలా ఒక విషప్రచారం చేసినట్లయితే.. వారితో పొత్తు పెట్టుకున్నందుకు తెలుగుదేశానికి కూడా ఓట్లు పడకుండా అడ్డుకోవచ్చుననేది వారి ప్రణాళిక. అందుకే ఎక్కడెక్కడో ఎవరెవరో మాట్లాడిన మాటలన్నింటినీ తీసుకువ చ్చి.. వైసీపీ దళాలు వారికోసం పనిచేస్తున్న నీలిమీడియా దుష్ప్రచారం సాగిస్తున్నాయి.

వైసీపీ నాయకులు మద్యలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల మీద పడి ఏడుస్తుండడం ఇంకో తమాషా. విషయం ఏంటంటే.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతోనే ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు బిజెపి మీద నిశిత విమర్శలు చేస్తున్నారు. బిజెపి మళ్లీ గెలిస్తే దేశంలో అసలు రిజర్వేషన్లు ఉండనే ఉండవు అని వారు ప్రచారం సాగిస్తున్నారు. మధ్యలో వైసీపీ వారి ఏడుపు ఏంటంటే.. బిజెపిని నిందిస్తున్న ఇలాంటి వార్తలు తెలంగాణ ఎడిషన్లలో మాత్రమే కనిపిస్తున్నాయి.. ఏపీ ఎడిషన్లలో కనిపించడం లేదు అని మాట్లాడుతున్నారు.

తెలంగాణ సీఎం వ్యాఖ్యల గురించి ఏపీ ఎడిషన్లలో ఎందుకు వస్తుంది? అనే ఇంగితాన్ని మరచిపోతున్నారు. రేవంత్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డికి కూడా దమ్ముంటే, కేంద్రంలో మోడీ సర్కారు మళ్లీ వచ్చిందంటే.. దేశంలో అసలు రిజర్వేషన్లు ఉండవు, ముస్లింలకు అన్యాయం జరుగుతుంది.. బిజెపికి మాత్రమే కాదు, వారితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశానికి కూడా ఓట్లు వేయకండి… అని చెప్పవచ్చు. కానీ ఆయనకు ఆ ధైర్యం లేదు. బిజెని స్ట్రెయిట్ గా నిందించలేరు. ఎక్కడో ఎవరైనా నిందిస్తే.. ఆ నిందలు ఏపీలో కూడా ప్రచారం కావాలని, అది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ద్వారా పబ్లిష్ కావాలని ఆయన కోరుకుంటారు. తన సొంత పత్రిక సాక్షిలో వస్తే తన పార్టీ వారు తప్ప మరెవ్వరూ నమ్మరు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. తిమ్మిని బమ్మిని చేసి అయినా సరే.. బిజెపి వ్యతిరేక గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని తెలుగుదేశానికి ఓట్లు పడకుండా చూడాలనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories