టీడీపీ దోచుకోవడం లేదని జగన్ దళాల దిగులు!

రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ అనేది పూర్వ పద్ధతిలో ప్రెవేటు వ్యాపారులకే అప్పగించే అవకాశం ఉన్నదని వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు అప్పుడే ఒక రకమైన గోల ప్రారంభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మద్యం వ్యాపారం రూపంలో వేలాదికోట్లరూపాయల సొమ్ము అడ్డగోలుగా దోచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాము దోచుకున్న మార్గాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దోచుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నట్టుగా ఉంది. కొత్త మద్యం పాలసీ తయారు చేయడానికి ప్రభుత్వం అయిదుగురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తే.. అప్పుడే జగన్ మోహన్ రెడ్డి దళాలు విలాపాలు ప్రారంభించాయి. 

తమాషా ఏమిటంటే.. ఈ మంత్రివర్గ సబ్ కమిటీ ఇంకా నిర్ణయాలు తీసుకోనేలేదు. ఒక వేళ నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఉంటే.. ఆ నివేదిక ప్రకారం గానీ, అందులో మార్పుచేర్పులతో గానీ ప్రభుత్వ నిర్ణయం వచ్చి ఉంటే.. అందులో లోపాలను గమనిస్తే.. ప్రతిపక్షం వాటి గురించి మాట్లాడడం సబబుగా ఉంటుంది. అలాకాకుండా, ఇలా కమిటీ ఏర్పాటు కాగానే.. వారు ఏం నిర్ణయాలు తీసుకుంటారోనని ఊహించి..ఆ ఊహల ఆధారంగా ముందే విమర్శలు వండి వార్చడం అనేది చవకబారు తనం అనిపించుకుంటుంది. లిక్కర్ పాలసీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న పని అదే. 

లిక్కరు సిండికేట్లకు అప్పగించి మద్యం షాపులను ప్రెవేటు వారికి ఇచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని అంటున్నారు. ఈ పాయింట్ లో అసలు జగన్ దళాల ఏడుపు ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం అంటే లిక్కరు అమ్ముకునే వ్యవస్థగా ఉండాలని అనుకుంటున్నారా? లేదా, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వ్యవస్థగా ఉండాలని అనుకుంటున్నారా? బోధపడడం లేదు! వైసీపీ సర్కారు గవర్నమెంటు తరఫున లిక్కరు షాపులను నిర్వహించి చూపించింది. ఒక నిర్ణీత ఆదాయాలను నమోదు చేసింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు అదే మోతాదు విక్రయాలతో అంతకంటె తక్కువ లాభాలను నమోదు చేస్తే గనుక.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రెవేటు వారికి దోచిపెడుతున్నారని విమర్శించాలి. అలా కాకుండా ముందే నానా చెత్త మాటల మాట్లాడడం వారి దుర్మార్గానికి నిదర్శనం. తాము దోచుకున్నట్టుగా ప్రజల సొత్తును ఈ ప్రభుత్వం దోచుకోవడం లేదని బాధపడడం వీరికి మాత్రమే చెల్లింది.

Related Posts

Comments

spot_img

Recent Stories