లంగాణలో సినిమా నటులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఏపీలోని ప్రభుత్వం పూనికతో జరుగుతున్నాయట! చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని పురమాయించి.. ఇవన్నీ చేయిస్తున్నారట. తమకు కిట్టని వారి మీద ఏ రేంజిలోనైనా ముడిపెట్టి ఆనందించగలం అని వైఎస్సార్ కాంగ్రెస్ నిరూపిస్తోంది. మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టి తమ రాజకీయ ప్రత్యర్థుల బురద చల్లి కుత్సితానందం పొందడంలో తమను మించిన వారు లేరని కూడా జగన్ దళాలు నిరూపించుకుంటున్నాయి.
కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని అన్నట్టుగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేసినప్పుడే.. ఈ వ్యవహారాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రంగు పులిమి ఎలాంటి దుర్మార్గపు ప్రచారానికి పాల్పడబోతున్నదో అందరికీ అర్థమైంది. శుక్రవారం రోజున రాష్ట్రంలోర జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ ధర్నాలు చేస్తున్నది కాబట్టి.. ఆ కార్యక్రమాలకు సరైన కవరేజీ రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబునాయుడు, స్వయంగా రేవంత్ రెడ్డితో మాట్లాడి అల్లు అర్జున్ ను అరెస్టు చేయించి.. మీడియా అటెన్షన్ అటు తిప్పారని వైసీపీ చెప్పుకుంది. ఆ రకమైన వంకర ప్రచారంతో వారు మురిసిపోయారు. కనీసం తమ సొంత చానెల్లో కూడా తమ ధర్నాలు గురించి వేసుకోవడానికి దిక్కులేనంత నీరసంగా అవి జరిగాయని చెప్పుకోలేక.. ఈ ముసుగు తొడిగారు.
శనివారం నాడు కొత్త పాట ప్రారంభించారు. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా.. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన వైనం కూడా చంద్రబాబుకు ముడిపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డిని వెనుకనుంచి నడిపిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న సినీ నటుల మీద కక్ష తీర్చుకోవడానికి ఈ పనులు చేయిస్తున్నారనేది వైసీపీ దళాల తాజా ఆరోపణ.
నాగార్జున గతంలో కొంత జగన్ కు అనుకూలంగా మట్లాడిన సందర్భాలు ఉండడం.. అలాగే అల్లు అర్జున్ తన మిత్రుడైన శిల్పా రవిచంద్రారెడ్డి విజయాన్ని కోరుకుంటూ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లడం వంటి వాటిని ఆధారం చేసుకుని.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ఇద్దరు నటులూ వైసీపీ కార్యకర్తలు కాదు. జగన్ కు బహిరంగంగా ఎన్నడూ రాజకీయ మద్దతు ప్రకటించనూ లేదు. అయినా సరే.. వారి అభిమానుల్ని తమ వైపు తిప్పుకోవడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ లాగా.. వారు వైసీపీ వారు గనుక.. వారిని వేధించడానికి చంద్రబాబునాయుడు సర్కారు రేవంత్ ద్వారా పోలీసులను ప్రయోగిస్తున్నదని అనడం వైసీపీ వారి కుటిల బుద్ధులకు నిదర్శనంగానే కనిపిస్తోంది.