తెలుగు ప్రజల కలల రాజధానిగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతుంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్లలో నిప్పులు పోసుకున్న సంగతి అందరికీ తెలుసు. అమరావతి రాజధానిగా ఎప్పటికి ఆవిష్కృతం అయినా సరే.. ఆ నగరానికి సంబంధించిన పూర్తి కీర్తి చంద్రబాబునాయుడు ఖాతాలోకే వెళుతుందని ఆయన ఉడికిపోయారు. అందువల్ల అమరావతి మీద కక్ష కట్టారు. అయిదేళ్ల పాటు అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా ద్రోహం చేశారు. కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేశఆరు. ఇప్పుడు అమరావతి నగర నిర్మాణ పనులు పునఃప్రారంభం అవుతున్న తరుణంలో.. మళ్లీ కుట్రలు ప్రారంభించారు. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో.. మరో 44 వేల ఎకరాల భూసేకరణకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుండగా.. కుట్రలు చేసి ఆ ప్రయత్నాలకు మోకాలడ్డడానికి జగన్ దళాలు రంగంలోకి దిగాయి.
అమరావతిని ప్రపంచం తలతిప్పి చూసే రాజధానిగా తీర్చిదిద్దుతానని చంద్రబాబునాయుడు ఎన్నడో ప్రకటించారు. జగన్ ఎన్ని ద్రోహాలు చేసినా.. అమరావతి ప్రాజెక్టు మళ్లీ పట్టాలు ఎక్కింది. ఆ నగర అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఓ అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ హంగులతో అద్భుతమైన స్పోర్ట్స్ సిటీ కూడా ఉండాలని చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నారు.
ఈ రెండూ కూడా దేశంలోనే అమరావతికి వన్నెతెచ్చే విధంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఐదువేల ఎకరాల్లో విమానాశ్రయం ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదు తర్వాత ఇది దేశంలో అతిపెద్దది అవుతుంది. అలాగే స్పోర్ట్స్ సిటీకి 1600 ఎకరాలు అవసరం అవుతాయి. 5000 ఎకరాలు విమానాశ్రయానికి కేటాయించాలంటే.. అందుకు 30 వేల ఎకరాలను సమీకరించాల్సి ఉంటుంది. భూ సేకరణ అయితే అంత విస్తీర్ణం అవసరంలేదుగానీ.. రైతులు బాగా నష్టపోతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా 44 వేల ఎకరాల సమీకరణ ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం.
అయితే ఆ భూసమీకరణ ప్రయత్నాల వల్ల.. అమరావతి నిర్మాణ పనులు మందగిస్తాయని, చంద్రబాబునాయుడు ఈ నగర పనులను పక్కకునెట్టేసి ఆ కొత్త నగరం మీద కన్నేస్తారని జగన్ దళాలు ఒక దుష్ప్రచారం అప్పుడే ప్రారంభిస్తున్నాయి. అసలు ఆ భూ సమీకరణ ఇంకా ఆలోచన దశలో ఉన్న సమయంలోనే వీరు ఇలా విషం కక్కడం సాగిస్తున్నారు. అమరావతి ప్రాంత రైతుల్లో తమ పార్టీకి అనుకూలంగా ఉండేవారి బుర్రల్లోకి ఎక్కిస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందన్నట్టుగా పురిగొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే కనుల ముందే అమరావతిలో పనులు ముమ్మరంగా జరుగుతూ ఉండగా.. జగన్ దళాల కుటిల ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.