ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా.. అదే నిజం అన్నట్లుగా ప్రజలను మభ్యపెట్టి నమ్మించవచ్చు- అనేది ఇలాంటి దుష్ప్రచారాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గొబెల్స్ కనిపెట్టిన సిద్ధాంతం. గోబెల్స్ ను ప్రమాణంగా తీసుకుంటే గనుక జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రజలలోకి విషాన్ని ప్రచారం చేయాలని అనుకునే దళాలలో, వైసిపి వ్యూహకర్తలలో కొన్ని వందల వేల మంది గోబెల్స్ తయారవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక అబద్ధాన్ని కాదు, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చాప కింద నీరు లాగా, ప్రభుత్వం పట్ల, ప్రజలలో వివిధ వర్గాలలో అసంతృప్తిని విషపు విత్తనం లాగా నాటడానికి అనేక రకాల కుట్రవ్యుహాలను జగన్ దళాలు అమలు చేస్తున్నాయి. ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా అబద్ధాలను ప్రచారం చేయడంతో పాటు, మరో భిన్నమైన కుటిల వ్యూహాన్ని కూడా వీరు అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ఫలానా గొప్ప పని చేయబోతున్నది దీని వలన ఫలానా ఫలానా వాళ్లు లబ్ధి పొందబోతున్నారు అనే తప్పుడు ఆశలను ప్రజలలో మొలకెత్తించడం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోయినా ఆ పని జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఊదరగొట్టడం.. ఫలానా తేదీ లోగా జరుగుతుంది అని కూడా ఈ వైసీపీ వ్యూహకర్తలే గడువు తేదీలను ప్రకటించేయడం.. అంతా అయిన తర్వాత ఆ పని చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వారే నెగటివ్ ప్రచారం సాగించడం, వారి తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆశపడిన ప్రజలలో అసంతృప్తిరేగేలా చూడడం ఈ సరికొత్త వ్యూహం. జగన్ దళాల సోషల్ మీడియా వక్ర ప్రచారాల విషయంలో కూటమి ప్రభుత్వం పెద్దలు ఎప్పటికప్పుడు మరింత అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడుతోంది.
అబద్దాలను ప్రచారం చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు కూడా స్వయంగా పూను కుంటున్నారు. అదే సమయంలో ప్రజలలో తప్పుడు ఆశలు రేకెత్తించే విషయంలో గుట్టుచప్పుడు కాకుండా సోషల్ సైకోలతో పని కానిస్తున్నారు. కొన్ని ఉదాహరణలు గమనిస్తే ఈ సంగతి మనకు బాగా అర్థం అవుతుంది.
తిరుమల వ్యవహారాలను గమనిస్తే గనుక ఒకటో రకం కుటిల నాయకులు మనకు కనిపిస్తారు. భూమన కరుణాకర రెడ్డి లాంటి వాళ్లు టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని, విష్ణుమూర్తి విగ్రహాన్ని రోడ్డుపక్కన చెత్త దిబ్బల వద్ద పడేశారని అధికారికంగా అబద్ధాలను, ఆత్మసాక్షి పాపభీతి లేకుండా ప్రచారంలో పెడుతుంటారు. అదే సమయంలో వృద్ధులకు దర్శనం విషయంలో నిబంధనలు మారుతాయని, టీటీడీకి సంబంధించిన అనేక అంశాల్లో మరికొన్ని అబద్ధాలను దొంగచాటుగా సోషల్ సైకోలు ప్రచారంలో పెడతారు. ఏది చేసైనా సరే.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నదే కోరిక.
డీఏల సంగతే చూద్దాం. ప్రభుత్వం పీఆర్సీ విధించి సిఫారసులను ఆమోదించిన తరువాత.. ఉద్యోగుల జీతం పెరుగుతుందని అంతా అనుకుంటారు. వారికి వస్తున్న జీతాలు తగ్గడం, అప్పటిదాకా ఐఆర్ రూపంలో పొందిన ‘అదనపు మొత్తాలను’ వారినుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దేశచరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు చేయలేదు. జగన్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఉద్యోగులను ఎంత ఘోరంగా వంచించారో అందరికీ తెలుసు. ఆ వర్గంలో అసంతృప్తి మూటగట్టుకోవడం వల్లనే.. పతనం అయిపోయిన సంగతి ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు వ్యూహాత్మకంగా.. ఉద్యోగుల్లో కూటమి సర్కారు పట్ల అసంతృప్తి రావడానికి వారు పావులు కదుపుతున్నారు. కేబినెట్ సమావేశం అవుతున్న ప్రతిసారీ.. ఈ భేటీలో మూడు డీఏలు ఇచ్చేలా నిర్ణయం వస్తుందని దొంగచాటు సోషల్ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించడం.. భేటీ తర్వాత.. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చిలకరించిందని ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రచారం చేయడం వారికి అలవాటుగా మారింది. తద్వారా ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ద్వేషం పెంచాలని వారి ప్లాన్. కూటమి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి తప్పుడు ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.