2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయి కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. ఇంత అవమానకరమైన ఓటమి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి కూడా లేదు. అయితే సాధారణంగా ఏ పార్టీ అయినా సరే.. ఓడిపోయిన తర్వాత.. ఆత్మపరిశీలన చేసుకుంటుంది. ఎందుకు ఓడిపోయామో కారణాలను అన్వేషించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ కారణాల మూలాల్లోకి వెళ్లి.. వాటిని దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కాస్త ఆశావహ ఫలితం రావచ్చునని ఆశిస్తారు.
కానీ. అత్యంత నీచంగా ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీ ఓటమికి సంబంధించి అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదేమో అనే అనుమానం ఆ పార్టీఅలోనే అనేకమందికి కలుగుతోంది. ఎందుకంటే.. అసలు కారణాల్ని తెలుసుకున్న నాయకుడు ప్రవర్తించే తీరు ఆయనలా ఉండదని వారి అభిప్రాయం. అదంతా ఒక ఎత్తు అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కొత్త విషయాలు బయటపెట్టారు.
వైసీపీ గత ఎన్నికల్లో వాలంటీర్ల వల్లనే ఓడిపోయిందని ఆయన అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను ప క్కన పెట్టాలని తాను పలుమార్లు జగన్ కు సూచించానని, అలాంటిది ఆయన కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్లను నెత్తిన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూలస్తంభాల లాంటివారని, పాలకులకు ప్రజలకు మధ్య వారధిలో కార్యకర్తలు ఉండాలని తాను పలుమార్లు చెప్పినా జగన్ పట్టించుకోలేదని అన్నారు.
ఇవాళ పరిస్థితుల్ని గమనిస్తే కేసులు కార్యకర్తల మీదనే పెడుతున్నారని.. వాలంటీర్ల మీద పెట్టడం లేదని, ఆయన వాపోయారు. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో ఎన్నికల వేళ వాలంటీర్లను ఏ స్థాయిలో వాడుకున్నారో తెలియదు గానీ.. వాలంటీర్లను నెత్తిన పెట్టుకోవడం అనేది కేవలం వైఎస్ జగన్ వల్ల మాత్రమే జరిగింది.
ఇవాళ 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల బతుకుల్లో రూపురేఖలు మార్చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వాలంటీర్లను నెత్తిన పెట్టుకోవాలని తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ శతివిధాలుగా పోరారు. వారిని రాచి రంపాన పెట్టారని కూడా చెప్పవచ్చు. జగన్ మాటలు విని.. వాలంటీర్ల ద్వారా తమ విజయానికి బాటలు పడతాయేమో అని.. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాలంటీర్లకు చాలా ఖరీదైన కానుకలు, నగదు ముడుపులు ముట్టజెప్పి ఎన్నికలలో తమకు అనుకూలంగా పనిచేయించుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పప్పులేమీ ఉడకలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న అలవిమాలిన వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ ఓడిపోయింది. ఈ అసలు కారణాన్ని ఆయన ఎన్నటికి తెలుసుకుని మేలుకుంటారో మరి!