జగన్ రెండు జీవోలకు చీటీ చించేసిన అచ్చెన్న!

‘నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ..’ అంటూ బహిరంగ వేదికల మీద గొంతు చించుకుని అరుస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. ఎప్పుడైనా ‘నా మత్స్యకార సోదరులు..’ అంటూ అరిచారో లేదో పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఏ రోటికాడ ఆ  పాట పాడే.. ఏ ఇంటికాడ వారిని తమ్ముళ్లుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మత్స్యకార ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అలాంటి పడికట్టు డైలాగులు అనే ఉంటారు. కానీ వాస్తవంలో మత్స్యకారుల పొట్టకొట్టేలా.. చేపలు పట్టుకునే వారి హక్కులను కొల్లగొట్టి, బడాబాబులు కార్పొరేట్ వ్యాపారుల పరం చేసేలా జగన్మోహన్ రెడ్డి సర్కారు గతంలో కుట్ర పూరితంగా తెచ్చిన రెండు జీవోలను మంత్రి అచ్చెన్నాయుడు రద్దు చేశారు. శుక్రవారం నాడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్న.. జగన్ సర్కారు తెచ్చిన 144, 217 జీవోలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ రకంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు తీపి మిఠాయి లాంటి శుభవార్త చెప్పారు.

గతంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఈ జీవోలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. నరసాపురంలో సభ నిర్వహించి.. జీవోనెం.217 ప్రతులను ఆయన చించిపారేశారు. మత్స్యకారుల పొట్టకొట్టేందుకే జగన్ అవి తీసుకువచ్చారని విమర్శించారు. ఆ జీవో ప్రకారం.. మత్స్యకారులు పెద్దపెద్ద చేపల చెరువుల్లో చేపలు పట్టే అధికారం కోల్పోతారు. ఆ హక్కును ప్రభుత్వం వేలం వేసేస్తుంది. బడా వ్యాపారులు చొరబడి గద్దల్లా తన్నుకు పోతారన్నమాట.

కేవలం తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చేపల చెరువులు మాత్రమే మత్స్యకారులకు దక్కుతాయి. 100 హెక్టార్లకంటె పెద్ద చేపల చెరువులన్నీ బడా వ్యాపారుల పరం అవుతాయి. అయితే ఆయా వర్గాల నుంచి ఎన్ని నిరసనలు వెల్లువెత్తినప్పటికీ.. ఈ జీవో వల్ల వారికి లాభమే తప్ప నష్టం లేదంటూ ప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 27 రిజర్వాయర్లను వేలం వేసి.. మత్స్యకారుల పొట్ట కొట్టారు. ఎన్ని పోరాటాలు జరిగినా వృథా అయ్యాయి.

చివరికి తెలుగుదేశం అధికారంలోకి రాగానే.. ఆ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మత్స్యకారుల జీవితాలను నాశనంచేసే ఆ రెండు జీవోలను రద్దు చేసేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories