జగన్ కళ్లు బైర్లు కమ్మేలా.. సంక్షేమ నిర్వచనం!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజా సంక్షేమం అనే పదానికి తెలిసిన నిర్వచనం ఒక్కటే. బటన్ నొక్కడం. బటన్ నొక్కడం అనేదేదో మహా ఘనకార్యం అయినట్టుగా.. ఇప్పటికీ ఆయన దాని గురించే చెప్పుకుంటూ ఉంటారు. పైగా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కడం లేదంటూ నిప్పులు చెరుగుతారు కూడా. ఏదో ఒక కేటగిరీ పేరు చెప్పి జనాన్ని గుంపు చేయడం.. వాళ్లందరికీ బటన్ నొక్కి ఖాతాల్లోకి డబ్బులు పంపేయడం.. వారి కుటుంబాలన్నీ నాకు ఓటు బ్యాంకు అని మురిసిపోవడం.. ఇవే సంక్షేమ నిర్వచనాలుగా ఆయన పాలన సాగించారు. అంతే తప్ప పేదలతో కలవాలని, వారి కష్టాలు తెలుసుకోవాలని.. తాను తలచింది కాదు కదా.. వారు కోరినవి చేయాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు.  సంక్షేమం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అలా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా సాగిపోయింది. కనీసం వారితో మాట్లాడేవారు కూడా కాదు. పలకరించేవారు కాదు.

పైగా జగన్ జమానాలో సంక్షేమం అనేది కేవలం ఓటు బ్యాంకు నిర్మాణ ప్రయత్నంగా ఉండేది తప్ప.. ప్రజల కష్టాలను బట్టి, వాటి నివృత్తికి చేసే సాయంగా ఉండేది కాదు. అసలైన సంక్షేమం అంటే.. ప్రజలకు కష్టాలు వచ్చే సమయాలను గుర్తించి.. ఆయా సమయాల్లో ఇతోధికంగా వారికి అండగా నిలవడం మాత్రమే అనే అసలు సిసలు నిర్వచనాన్ని చంద్రబాబునాయుడు ఇప్పుడు నిరూపిస్తున్నారు. ‘వాల్లు బటన్లు నొక్కడం లేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కే జగన్.. అసలు ఈ పాయింట్ గుర్తించాల్సిన సందర్భం ఇది.

ఏడాదిలో సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సీజనులో వాటి పునరుత్పత్తికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రభుత్వం వేటకు వెళ్లడాన్ని నిషేధిస్తుంది. ఆ సీజనులో మత్స్యకార కుటుంబాలేవీ వేటకు వెళ్లవు. రోజువారీ చేపలవేటే వృత్తిగా బతికే వారి కుటుంబాలకు నిషేధకాలం గడ్డురోజులే. ఈ ఉద్దేశంతో.. సంక్షేమానికి  అసలైన నిర్వచనం తెలిసిన తెలుగుదేశం ప్రభుత్వ 2014 లో మొదటిసారిగా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రవేశ పెట్టింది. అప్పట్లో అయిదు సంవత్సరాలకు గాను 788 కోట్లు మత్స్యకార కుటుంబాలకు ఇచ్చారు. జగన్ ప్రభుత్వ కాలంలో మత్స్యకారులకు వేట నిషేధ సీజనులో నెలకు రూ.పదివేల వంతున ఇచ్చేవారు. కానీ.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఈ భృతిని ఏకంగా రెట్టింపుచేసి 20 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు వేట నిషేధ సీజను రావడంతోనే.. ఆ కుటుంబాలకు 20 వేలు ఇచ్చే పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 259 కోట్లు వెచ్చించనున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. బటన్ నొక్కడానికి పెద్ద తెలివి అక్కర్లేదు.. కానీ మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడి మీ సంగతులు తెలుసుకునే ఉద్దేశంతోనే కార్యక్రమాలను ఇలా నిర్వహిస్తున్నాను.. అని చంద్రబాబు వారితో అన్నారు. మత్స్యకారుల నుంచి చేపలు తీసుకుని.. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపలదుకాణాలు నిర్వహిస్తూ.. డబ్బు సంపాదన మీద జగన్ దృష్టి పెట్టారు గానీ.. ఆ కుటుంబాలబాగు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా నెలకు రూ20వేల వంతున ఇవ్వడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories