తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం.. రెండు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన పిఆర్ టీం చాలా సఫలవంతంగా పనిచేయడంతో, దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్టు హైలైట్ అయింది! అరెస్ట్ విషయంలో తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి నాయకులు చాలా తీవ్రంగా స్పందించి ప్రభుత్వాన్ని విపరీతంగా నిందించారు. అంతేతప్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. టిఆర్ఎస్- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం కోసమే అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడింది తప్ప, ఇందులో నిజానిజాల విచక్షణతో కాదు అనేది అందరికీ తెలిసిందే! కేవలం ఆ కారణంగానే ఇతర పార్టీలేవి జోక్యం చేసుకోలేదు.
ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అతిగా వ్యవహారాన్ని ఒళ్లంతా పులుముకొని మాట్లాడింది. వైఎస్ఆర్ కాంగ్రెసుకు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అరెస్టును ఖండిస్తూ ఆయనకు సానుభూతి తెలియజేశారు. అలాగే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి అల్లు అర్జున్ వైయస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే నాయకుడు గనుక ఆయనను అరెస్టు చేయాలని చంద్రబాబు నాయుడు స్వయంగా రేవంత్ రెడ్డి తో మాట్లాడి పావులు కలిపి ఈ పని చేయించారంటూ అడ్డగోలు వాదనలు కూడా వినిపించారు.
మరో కోణంలో గమనించినప్పుడు చంద్రబాబునాయుడు కూడా అరెస్టు తర్వాత అల్లు కుటుంబానికి ఫోను చేసి పరామర్శించారే తప్ప.. ఖండనముండనలు వంటి వాటి జోలికి వెళ్లలేదు.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ అరెస్టు వ్యవహారంలో అడ్డంగా అల్లు అర్జున్ ను వెనకేసుకు రావడం వలన జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రజల దృష్టిలో మరింతగా చులకన అయినట్లుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సినీ హీరో అల్లు అర్జున్ కు వత్తాసుగా మాట్లాడటం నీచాతినీచం అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శిస్తున్నారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఊడిగం చేయడం సిగ్గుచేటు అని ఆయన అంటున్నారు. హైదరాబాదులో అల్లు అర్జున్ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందితే ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయకుండా అందుకు బాధ్యులు అరెస్టు అయినందుకు జగన్మోహన్ రెడ్డి అతిగా స్పందించడం సిగ్గుచేటు అన్యాయం అంటున్నారు.
పాపం జగన్.. అల్లు అర్జున్ ద్వారా ఓట్లు వస్తాయని భ్రమ పడుతున్నారో ఏమో తెలియదు. అదే నిజమైతే ఇటీవల ఎన్నికలలో నంద్యాలలో పార్టీ గెలిచి ఉండేది కదా అనే వాస్తవాన్ని కూడా ఆయన గ్రహించడం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ను వెనకేసుకు రావడం కోసం తన పార్టీ పరువు, తన పరువు సమూలంగా మంట కలుపుకున్నట్లుగా కనిపిస్తోంది.